Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్ డౌన్ లోనూ వీడని సంకల్పం: ఆంధ్రప్రదేశ్ లో 52,49,802 మందికి పెన్షన్ల పంపిణీ

లాక్ డౌన్ లోనూ వీడని సంకల్పం: ఆంధ్రప్రదేశ్ లో 52,49,802 మందికి పెన్షన్ల పంపిణీ
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:51 IST)
ఆంధ్రప్రదేశ్ లో వృధ్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల ఒకటోతేదీనే పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి కరోనా వైరస్ నియంత్రణ నిబంధనలు కూడా తలవంచాయి.

పండుటాకుల చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు లాక్ డౌన్ నిబంధనలు ఆటంకం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయి. వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి ప్రస్తుతం అమలు అవుతున్న కరోనా నియంత్రణ నిబంధనల వల్ల ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళనలకు ప్రభుత్వ ముందుచూపు చర్యలు చెక్ పెట్టాయి.

ఒకవైపు లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ... సామాజికదూరంను పాటిస్తూ... కరోనా వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలను పాటిస్తూ... ప్రభుత్వ యంత్రాంగం మొక్కవోని దీక్షతో ఒకటోతేదీన (బుధవారం)నాడు 93 శాతంకు పైగా పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందించడం ద్వారా తన చిత్తశుద్దిని చాటుకుంది.

ఈ ప్రక్రియలో సచివాలయంలోని సీనియర్ ఐఎఎస్ అధికారుల నుంచి గ్రామస్థాయిలోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వరకు భాగస్వాములయ్యారు. ఒకవైపు కరోనా నియంత్రణ జాగ్రత్తలను తాము పాటిస్తూ... పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందిస్తూ... కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగింది. 
 
కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా మొబైల్ యాప్
ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పెన్షన్ డబ్బును లబ్దిదారుల చేతికే అందించే క్రమంలో వారి నుంచి తీసుకునే బయో మెట్రిక్ వల్ల కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదంను నివారించేందుకు చర్యలు తీసుకుంది.

అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించింది. దానిలో లబ్ధిదారుల ఫోటో ఐడెంటిఫికేషన్ ను వాలంటీర్లు నిర్ధారించడం, జియోగ్యాగింగ్ తో లబ్ధిదారుల ఫోటోను యాప్ లో అక్కడికక్కడే తీసుకోవడం ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేశారు.

ఎక్కడా లబ్దిదారులను నేరుగా తాకకుండా, అందరికీ ఉపయోగించే బయోమెట్రిక్ ను వాడకుండానే ఈ యాప్ తో పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించినట్లు సెర్ఫ్ సిఇఓ రాజాబాబు తెలిపారు. 
 
ఉదయం నుంచే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ
ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఉదయం ఎనిమిదిన్నర గంటలకే 53శాతం పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ దారులకు డబ్బులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వృద్దులకు, వివిద వ్యాధులతో బాధపడుతున్న వారికి వివరించారు. ఉదయం పదిగంటలకే 77శాతం పెన్షన్లను పంపిణీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా 88.27 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. సాయంత్రం అయిదు గంటల వరకు 93శాతం పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు.

మొత్తం 58,08,404 మంది పెన్షన్లకు గానూ (సాయంత్రం 5గంటల వరకు) 52,49,802 మందికి పెన్షన్లను అందచేశారు. ఈనెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం 1395.75 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనిలో 93శాతం వరకు సాయంత్రంలోగానే పంపిణీ చేయడం విశేషం. 
 
జిల్లా మొత్తం పెన్షన్లు పంపిణీ చేసినవి
వైఎస్ఆర్ కడప 329194 మందికి గాను 310768 మందికి ఇచ్చారు.
చిత్తూరు 495769 - 458811
విజయనగరం 326524 - 300138
అనంతపురం 510975 - 471418
కర్నూలు 422547 - 389296
శ్రీకాకుళం 367360 - 338168
తూ.గో.జిల్లా 638763 - 571765
నెల్లూరు 343856 - 314993
కృష్ణా 481502 - 435178
విశాఖపట్నం 451359 - 383978
ప.గో.జిల్లా 474658 - 420994
ప్రకాశం 411285 - 363181
గుంటూరు 554612 - 491114

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రోగితో టిక్ టాక్ వీడియో, ఎవరు? ఎక్కడ?