Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ‘దిశ’ ఆధారాలు, మృతదేహం వద్ద ప్యాంటు జిప్, ఇంకా... నిందితుల శిక్షకి ఇవే కీలకం

Advertiesment
Disha case
, బుధవారం, 4 డిశెంబరు 2019 (12:24 IST)
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న దిశ అత్యాచారం, హత్య కేసులో సేకరించిన ఆధారాలు రెండు మూడు రోజుల్లో ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి అందనున్నాయి. నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ఇవే కీలక ఆధారాలుగా మారనున్నాయి. 
 
అందుకే దర్యాప్తు అధికారులు వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ కేసులో పోలీసులు సాధ్యమైనంత త్వరలోనే దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సేకరించిన ఆధారాలకు ఫోరెన్సిక్‌ పరీక్షలు కూడా వేగంగానే పూర్తి చేసే అవకాశం ఉంది.
 
ఒంటరిగా కనిపించిన దిశను నలుగురు నిందితులు మాయమాటలతో మోసగించి అత్యాచారం చేసి ఆపై హతమార్చిన సంగతి తెలిసిందే. ఆధారాలు దొరక్కుండా ఉండే ఉద్దేశంతో మృతదేహాన్ని దగ్గర ఉండి మరీ దహనం చేశారు. దాంతో శాస్త్రీయ ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. 
 
ఈ ఉదంతం సంచలనం సృష్టించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. దిశ అదృశ్యమైన మర్నాడు ఉదయమే షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద కాలిపోతున్న మృతదేహాన్ని చూసి సామల సత్యం అనే రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
 మృతదేహం వద్ద దొరికిన లాకెట్‌ ఆధారంగా దిశగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన క్లూస్‌ బృందం మృతదేహం వద్ద సగం కాలిన దుప్పటి ముక్కలు, ప్యాంట్‌ జిప్‌, బెల్టు బకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే శంషాబాద్‌ పోలీసులు దిశపై అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. తొండుపల్లి టోల్‌గేటు సమీపంలో ఉన్న గోడ పక్కన ఆమెపై అత్యాచారం జరిపినట్లు నిర్ధారణకు వచ్చి అక్కడా క్లూస్‌ బృందంతో తనిఖీలు నిర్వహించారు. 
 
లోదుస్తులు, గుర్తింపుకార్డు, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించడం ద్వారా నిందితులకు సంబంధించిన ఆధారాలు దొరికే అవకాశం ఉంది. క్లూస్‌ బృందం సేకరించిన ఆధారాల్లో డీఎన్‌ఏ నమూనాలు ఏవైనా లభ్యమయ్యే పక్షంలో నిందితుల నుంచి కూడా డీఎన్‌ఏ సేకరించి విశ్లేషిస్తారు. ఒకవేళ డీఎన్‌ఏ నమూనాలు దొరికినట్లయితే ఈ కేసులో ఇవే బలమైన ఆధారాలవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌరసత్వ బిల్లుకు ఆమోదం.. ముస్లిమేతర మతస్తులకు కూడా పౌరసత్వం