దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆమె తనకు కుమార్తెతో సమానమని తెలిపారు. తన ఇంటికి వస్తే ఆశీర్వదించి పంపించానని, అంతకుమించి ఏమీ లేదని జగన్‌కు సాయిరెడ్డి తెలిపారు.
ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైకాపా నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఇందులో జగన్, విజయసాయిరెడ్డిల మధ్య అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశంపై పెద్ద చర్చే జరిగింది. అసలేం జరిగింది. ఏమిటీ చర్చ.. మీడియాలో ఎందుకింత రాద్దాం జరుగుతుంది అని సాయిరెడ్డిని జగన్ నిలదీసారు. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంట పాటు వీరిమధ్య చర్చ జరగ్గా.. సాయిరెడ్డి తన వైపు నుంచి వివరణ ఇచ్చారు.
"కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకుని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఆ చానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2020లో అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఎండోమెంట్స్ విభాగంలో సీతమ్మదార కార్యాలయంలో కలిశాను. అప్పటి నుంచి ఆమెకు కూతురుగా భావిస్తున్నాను. ఓ తండ్రిగా అడిగినపుడల్లా సాయం చేశాను. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి చూశాను. మాట్లాడాను. నా ఇంటికి వచ్చినపుడు ఆశీర్వదించాను. అంతే.. ఇంతకుమించి ఏమీ లేదు" అని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై జగన్ స్పందన ఏంటన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల మేరకు.. సాయిరెడ్డికి జగన్ గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.