Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వక్ఫ్ బోర్డు ఆస్తుల డిజిటలైజేషన్: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

Advertiesment
Digitalization
, బుధవారం, 7 అక్టోబరు 2020 (07:23 IST)
ఆక్రమణల నుంచి రక్షణతో పాటు సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్టు ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. సచివాలయంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై డీఆర్వోలు, డీఎండబ్ల్యూవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముందుగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఇలియాజ్ రిజ్వి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తులను త్వరితగతిన స్వాధీనం చేసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతివ్వాలన్నారు.

వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ బాధ్యత డీఆర్వోలదేనని స్పష్టం చేశారు. డీఆర్వోల ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు ఆదాయం పెంపుదలపై తీసుకుంటున్న చర్యలపై చర్చించాలన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వేలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయన్నారు. అదే సమయంలో కమర్షియల్ భూములు, భవనాలకు అద్దె రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉంటోందన్నారు. 

ఆక్రమణలో ఉన్న భూములు స్వాధీనం చేసుకోండి...
వివాదంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు, అవి ఏయే దశల్లో ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను తక్షణమే జిల్లాల వారీగా అందించాలని డీఆర్వోలను ఆదేశించారు. కోర్టులతో సంబంధం లేకుండా ఆక్రమణలో భూములను గుర్తించి, వాటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు.

అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న భూములను అభివృద్ధి పర్చడానికి, ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు.  వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు స్థాపనకు లీజుకివ్వడంతో ద్వారా ఆదాయం రావడంతో పాటు వక్ఫ్ భూములకు రక్షణ కూడా కలుగుతుందన్నారు. ఆ దిశగా అధికారులు ఆలోచించాలన్నారు.

తూర్పు గోదావరిలో ఆక్రమణలో ఉన్న 130 ఎకరాలకు పైగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడంపై జిల్లా అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. స్వాధీనం చేసుకున్న భూములను అభివృద్ధి చేయాలని, తద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. 

ఆదాయం పెంపుదలకు రెంట్స్ రెవెన్యూ కమిటీ ఏర్పాటు...
రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకున్న వ్యవసాయ, కమర్షియల్ భూములతో భవనాలు ఎంతో విలువైనవని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం స్వల్పంగా ఉంటోందన్నారు. మార్కెట్ ధరలకనుగుణంగా కమర్షియల్ భవనాల నుంచి అద్దెలు వసూలు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల పరిస్థితులకనుగుణంగా అద్దెల నిర్ధారణకు రెంట్స్ రెవెన్యూ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.

ఈ కమిటీ అన్ని జిల్లాలో పర్యటించి, ఆయా ప్రదేశాల మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని అద్దె నిర్ధారిస్తుందన్నారు. రావాల్సిన అద్దె బకాయిలను త్వరగా వసూలు చేయాలని డీఆర్వోలను ఆదేశించారు. 

ఆస్తుల డిజిటలైజేషన్ తో ఆక్రమణలకు అడ్డుకట్ట...
రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను గుర్తించి, ఆన్ లైన్ లో పొందుపర్చనున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. డిజిటలైజేషన్ తో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల వివరాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. దీనివల్ల ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు అక్రమ లావాదేవీలకు అడ్టుకట్ట వేయొచ్చునన్నారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవడానికి కృషి చేస్తానన్నారు.

అనంతరం జిల్లాల వారీగా అద్దె బకాయిల వివరాలు, కేసుల వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవో అలీమ్ బాషా మాట్లాతూ, అద్దె రూపాల్లో లక్షలాది రూపాయు రావాల్సి ఉందన్నారు. తక్షణమే  వాటిని వసూలు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 13 జిల్లాలకు చెందిన డీఆర్వోలు, డీఎండబ్ల్యూవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాశ్వత రాజధాని అమరావతి కోసం ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధం: అఖిల పక్ష సమావేశం