Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కరోనా వల్ల వెళ్ళిపోయాడా, లేక కరెన్సీ అందలేదని బాధపడి క్వారంటైన్‌కు వెళ్ళాడా? అంబటి ఎద్దేవా

పవన్ కరోనా వల్ల వెళ్ళిపోయాడా, లేక కరెన్సీ అందలేదని బాధపడి క్వారంటైన్‌కు వెళ్ళాడా? అంబటి ఎద్దేవా
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (22:15 IST)
రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప మరో పని లేదని  వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శ్రీ అంబటి రాంబాబు అన్నారు. టిడిపి, బిజెపి తమ పాలనలో ఈ రాష్ట్రానికి చేసిన మేలును ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాయని, ఇక వారు ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకంటూ ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలను వైయస్‌ఆర్‌సిపి నెరవేర్చిందని గుర్తు చేశారు. అందుకే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మేం అమలు చేసిన సంక్షేమ పథకాలను గురించి చెప్పి, మా పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నామని వెల్లడించారు. దీని వల్ల తిరుపతి ఉప ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు.
 
ప్రెస్‌మీట్‌లో శ్రీ అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడు తాజాగా తన పార్టీకి చెందిన వ్యక్తితో మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈనెల 17తో టిడిపి పరిస్థితి అయిపోయిందని అచ్చెన్నాయుడు స్వయంగా ఆ వీడియోలో చెబుతున్నాడు. తిరుపతి ఎన్నికల సందర్బంగా అంతర్గత సర్వేల్లోనే టిడిపికి 25 శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తాయని నివేదికలు వస్తున్నాయి. అవమానకరమైన ఓటమి టిడిపికి తప్పదనే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో వైయస్‌ఆర్‌సిపి గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో తాను ఓటమి పాలవుతున్నానని భావించిన చంద్రబాబు తిరుపతిలో పెద్ద డ్రామాకు తెర తీశాడు. తన సభపై రాళ్ళ వర్షం కురిసిందని, పలువురికి గాయాలంటూ తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. రోడ్డు మీద పడివున్న రాయిని చూపించి, తాట తీస్తా, డొక్క పగలకొడతానంటూ హెచ్చరికలకు దిగాడు. రౌడీ రాజ్యం, సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేయించాడు. పోలీసులు ఎక్కడా అంటూ హూంకరింపులకు దిగాడు. తరువాత రోడ్డుపై బైఠాయించడంతో పాటు, ఎస్పీ ఆఫీస్‌కు వెళ్ళి ఆందోళన చేశాడు. ఓడిపోతున్న నేపథ్యంలో చంద్రబాబు పబ్లిసిటీ డ్రామాకు తెర తీశాడు. 
 
టిడిపిపై రాళ్ళు వేయాల్సిన దుస్థితిలో మేం లేము. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారమే టిడిపి నేతలు గవర్నర్‌ను కలవడానికి సమయం తీసుకున్నారు. ఏకంగా కేంద్రం ఎన్నిక సంఘాన్ని కలవడానికి మరో బృందాన్ని పంపించారు. పోలీసుల వల్ల కాదు కేంద్ర పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సిపిని ఎదుర్కోలేక చంద్రబాబు ఇలాంటి డ్రామాలతో రాజకీయంగా మరింత దిగజారిపోయాడు. 
 
చంద్రబాబుపై రాళ్లు వేయించాల్సిన ఖర్మ ఎవరికి ఉంది? రాళ్లు వేయించుకోవాల్సిన ఖర్మ ఎవరికి ఉంది? రాళ్ల దాడి జరిగిందని సానుభూతి సంపాదించుకోవాల్సిన ఖర్మ ఎవరికి ఉంది? గెలిచే అవకాశమే లేని స్థితిలో చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయం ఇది. ఇంతగా దిగజారినందుకు చంద్రబాబు సిగ్గు పడాలి. అంత హడావుడిగా నేరుగా పోలీసుల మీద చంద్రబాబు ఆరోపణలు చేశారు. పోలీసుల ప్రోద్భలంతోనే రాళ్లు వేశారని ఆక్షేపించారు. అప్పటికప్పుడు చంద్రబాబు ఏ ప్రాతిపదికన ఇలా మాట్లాడారు?. ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో సీఎం గారి మీద ఆరోపణలు చేశారు?. రాళ్ల దాడి జరిగితే ఎవరు గాయపడ్డారు? గాయపడిన వారే లేకుండా.. రాళ్ల దాడి జరిగిందని ఎందుకు డ్రామా ఆడారు? రాళ్లదాడి జరిగితే.. గాయాలు ఏవి? అంత హఠాత్తుగా చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, ఇతరులు మీడియా ముందు డ్రామాలు ఆడారంటే.. ఇది ముందుగానే పథకం ప్రకారం ఆడుతున్న డ్రామాయే కదా?.
 
జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిడిపి వారు నామినేషన్లు వేశారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత హటాత్తుగా మేం జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొనడం లేదని చంద్రబాబు ప్రకటించారు. అలాంటి స్టంట్‌ను మరోసారి చంద్రబాబు తిరుపతి ఎన్నికల్లోనూ చేయబోతున్నాడు. తనపై రాళ్ళ దాడి జరిగింది, కేంద్ర పారా మిలటరీ బలగాలు రాలేదు కాబట్టి ఎన్నికల నుంచి విరమిస్తున్నామని  ఆఖరి నిమిషంలో ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాడా? అవమానకరమైన ఓటమి కంటే ఎన్నికల్లో పాల్గొనకుండా పారిపోయేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నాడు. రాళ్లు విసిరారు అంటూ కుట్రలతో సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
 
ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. ఆయన పాలనను ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్‌ గారిని బలపరిచేందుకు ప్రజలు భారీగా ఓట్లు వేసి డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించబోతున్నారు. దీనికి భయపడే చంద్రబాబు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. 
 
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన పర్యటనలో పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ కరోనా పేరుతో క్వారంటైన్‌కు పవన్‌ కళ్యాణ్‌ వెళ్ళాడు కాబట్టి పాల్గొనలేక పోతున్నాడని ప్రకటించారు. నిజంగా కరోనా వల్ల వెళ్ళిపోయాడా, లేక కరెన్సీ అందలేదని బాధపడి క్వారంటైన్‌కు వెళ్ళాడా అని పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రజలు గుసగుసలాడుతున్నారు. నడ్డా గారు అడ్డగోలుగా మాట్లాడుతూ ఇసుక, మద్యం, పోర్ట్‌లలో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఆయన మాటలు చూస్తుంటే బిజెపి జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి టిడిపి జాతీయ అధ్యక్షుడి స్థాయికి నడ్డా పడిపోయాడా అని అనిపిస్తోంది.
 
ఇక లిక్కర్‌కు సంబంధించి కూడా నడ్డా అడ్డమైన విమర్శలు చేశారు. 2018–19లో లిక్కర్‌ సేల్స్‌ 34 లక్షల కేసులు ఉంటే ఇప్పుడు 21 లక్షల కేసులకు అమ్మకాలు తగ్గిపోయాయి. అదే బీరును తీసుకుంటే అప్పట్లో 17 లక్షల కేసులు అమ్మకం ఉంటే అది ఇప్పడు 7 లక్షల కేసులకు తగ్గిపోయింది. అప్పటితో పోలిస్తే  ఇప్పుడు షాపులు కూడా తగ్గించాం. అప్పట్లో 48 వేల బెల్టుషాపులు ఉంటే అన్నింటినీ మూసేశాం. ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్‌ అమ్ముతోంది. ఇంకా లిక్కర్‌ అమ్మకాల సమయం కూడా తగ్గించాం. దేవాలయాలు, బడులు, బస్టాపులు పక్కన, రోడ్డు మీద తాగే కల్చర్‌ను పూర్తిగా మార్చేశాం. ప్రజల ఆరోగ్యం దృష్యా›్ట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఇలా లిక్కర్‌ సేల్స్‌ తగ్గించారా? లిక్కర్‌ సేల్స్‌ తగ్గితే ఎక్కడైనా లంచాలు ఇస్తారా? 
 
ఇక పోర్టుల గురించి కూడా మాట్లాడారు. ఒక ప్రై వేటు పోర్టులో, ఆ కంపెనీకి చెందిన షేర్లను అదానీకి అమ్ముకుంటే ఇందులో ఎవరి బాధ్యత ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం?. అసలు అదానీ ఎవరి మనిషి? ఇంత బాధ్యతారహితంగా మాట్లాడ్డం వల్ల మీకు ఎన్ని ఓట్లు పడతాయి. కాని రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సినవి ఇచ్చారా? ఎన్ని సార్లు మిమ్మల్ని అడిగాం? ఎన్ని సార్లు మిమ్మల్ని నిలదీశాం? ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇప్పటివరకూ 14 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో 6 సార్లు సమావేశమయ్యారు. 33 లేఖలు రాశారు. హోం మంత్రి అమిత్‌షాతో 9 సార్లు సమావేశమయ్యారు. కాని రాష్ట్రానికి ఏమీ రాలేదు. దీర్థకాలంగా నెలకొని ఉన్న సమస్యలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి ఇప్పటికీ పరిష్కారాలు లభించలేదు. ఆ సమస్యలు తీరలేదు. 
 
పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,549 కోట్లకు చేరాయి. ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33,010 కోట్లు కావాలి. ఈ అంచనాలకు ఆమోదం తెలపమని పలుమార్లు కోరినా ఇంకా నిర్ణయం రాలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. విభజన చట్టం ప్రకారం దీని నిర్మాణానికి ప్రతిపైసా కూడా కేంద్రం చెల్లించాల్సి ఉంది. ప్రత్యేక హోదా మీద పోరాటాలు చేశాం. అనేకమార్లు మేం కోరాం. ఇప్పటికీ ఆ డిమాండ్‌ నెరవేర్చలేదు. ఒకే ఒక్క సంతకం ప్రధాని చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.22,948.76 కోట్లు రెవెన్యూ లోటు ఉందని కాగ్‌ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకూ రూ.3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయి. ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థిక సాయం ఇవ్వమని అడిగాం. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్,  దుగ్గరాజపట్నం లేదా రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉంది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవి. అయినా వీటి గురించి స్పందన లేదు.
 
వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున విభజన జరిగిన తర్వాత 7 ఏళ్లలో రూ.2,450 కోట్లు రావాల్సి ఉంది. బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరాం. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని కేంద్రానికి తెలిపితే.. ఇప్పటి వరకూ దీనిపై స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఇప్పటివరకూ దీనికి ఆమోదం లేదు. ఇవి కాక ఆస్తుల విభజన మీద ఇంకా పెండింగులో అనేక సమస్యలు ఉన్నాయి. వీటి గురించి కూడా పట్టించుకోవడంలేదు. విశాఖపట్నానికి రైల్వే జోన్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు. అవి ఎంతవరకూ వచ్చాయండి. పేరుకు ఇచ్చినట్టు ప్రకటించారు. ఇప్పటివరకూ ఒక్క పని ముందుకు సాగలేదు.
 
బిజెపి, టిడిపికి ఓటు అడిగే హక్కు లేదు. మాకు మాత్రమే ఓటు అడిగే హక్కు వుంది. మంచి పాలనను మేం మాత్రమే అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం. బిజెపి, టిడిపి కలిసి పని చేసినప్పడు ఇసుక, బెల్ట్‌ షాప్‌ల పేరుతో దోచుకున్నారు. 
 
నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం వున్న వ్యక్తి తనపై రాళ్ళు వేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఎన్నికల్లో టిడిపి అసలు మాకు పోటీనే కాదు. టిడిపిపై రాళ్ళు వేయాల్సిన ఖర్మ వైయస్‌ఆర్‌సిపికి లేదు. చంద్రబాబు పథకం ప్రకారం తనపై రాళ్ళు వేయించుకుని వైయస్‌ఆర్‌సిపిపై బురచల్లి అప్రదిష్టపాలు చేయాలనే కుట్ర దీనిలో వుంది. దీనిపై విచారణ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి. చంద్రబాబు నాటకానికి తెరపడాలి. 
 
రాయలసీమ ప్రాజెక్ట్‌లు ఎలా పూర్తి చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అసలు మీరు పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలను ఎందుకు ఆమోదించలేదు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ప్యాకేజీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎర్ర చందనాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ అమ్ముకున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థలు వారి వద్ద వున్నాయి. విచారణ చేసుకోవచ్చు. 
 
ఈ ప్రభుత్వంపై మతపరమైన ఆరోపణల చేస్తున్నారు. మేం అర్చకులు, మౌజమ్‌లు, పాస్టర్‌లకు ఆర్థిక చేయూతన అందిస్తున్నాం. ఏ ఒక్క మతానికో మేలు చేసే కార్యక్రమం చేయడం లేదు. అన్ని మతాలను సమానమైన గౌరవం ఇస్తున్నాము. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం. టిడిపి హయాంలో జన్మభూమి కమిటీలు తమకు ఓటు వేయలేదని పలువురికి సంక్షేమ పథకాలను అడ్డుకున్నాయి. నిజం తెలిసి కూడా బిజెపి మాట్లాడలేక పోతోంది.
 
స్థానిక ఎన్నికల్లో టిడిపికి అభ్యర్ధులు దొరకలేదు. మేం ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడలేదు. ప్రజలు ఏకపక్షంగా వైయస్‌ఆర్‌సిపిని గెలపించారు. ఓటమి భయంతో టిడిపి అర్ధాంతరంగా జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నుంచి పారిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.  జగన్‌ గారి పాలనను అందరూ మెచ్చుకుంటున్నారు. దీనిని చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్, బిజెపిలు మాట్లాడుతున్నాయి. ఈ రాష్ట్రంలో జగన్‌ గారికి ప్రత్యామ్నాయం లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్ధులే దొరకరు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారంపై జూన్ ఒకటి నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి కానుంది.