బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం క్రమంగా నైరుతి బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రరూపం దాల్చింది. మరో 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు మధ్యలోని కరైకాల్, మామల్లాపురం మధ్య తీరాన్ని తాకనుంది.
మంగళవారం నాడు ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో పుదుచ్చేరిలోని గాంధీ బీచ్ ఏరియాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
కాగా, ఈ వాయుగుండం తుఫానుగా మారితే ఇరాన్ ప్రతిపాదించిన మేరకు 'నివర్' అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 550 కిమీ దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిమీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.