బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీవనం శరవేగంగా దూసుకొస్తుంది. ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని, ఇది శనివారం ఉదయానికి తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
వచ్చే 24 గంటల్లో అది జవాద్ తుఫానుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర - ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు విశాఖ మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీస్, రెవెన్సూ, ఇరిగేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారంతా కలిసి పని చేసేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు.