Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైబర్ ల్యాబ్ అతివలకు అభయం...హైదరాబాద్‌లో న‌వంబ‌ర్ 2 ప్రారంభం

సైబర్ ల్యాబ్ అతివలకు అభయం...హైదరాబాద్‌లో న‌వంబ‌ర్ 2 ప్రారంభం
విజయవాడ , శనివారం, 23 అక్టోబరు 2021 (12:28 IST)
మహిళ‌లు, అమ్మాయిలు, చిన్నారులకు ఎదురవుతున్న వేధింపుల్ని నియంత్రించడంలో తెలంగాణ మహిళా భద్రత విభాగం మరో ముందడుగు వేస్తోంది. వీటికి సంబంధించిన ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు అనువుగా సైబర్‌ల్యాబ్‌ అందుబాటులోకి రాబోతోంది. నవంబరు 2న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లను సమకూర్చారు. సామాజిక మాధ్యమాలు, సెల్‌ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ల్యాబ్‌ ప్రాధాన్యం సంతరించుకొంది.

గతంలో ఇలాంటి ఫిర్యాదులు అంత సులభంగా పరిష్కారం అయ్యేవి కావు. ఠాణాల్లో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోవడంతో ఆలస్యమయ్యేది. తాజాగా ల్యాబ్‌ అందుబాటులోకి రానుండటంతో ఈ తరహా కేసులను ఛేదించడం సులభం కానుంది. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు ఏడొందలకుపైగా ఉన్న శాంతిభద్రతల, మహిళా పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే వేధింపుల ఫిర్యాదులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ల్యాబ్‌ అందించనుంది. ఇక్కడ వినియోగించే టూల్స్‌ కోసం సీఆర్‌సీఐడీఎఫ్‌ (సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌)తో ఇప్పటికే మహిళా భద్రత విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. దర్యాప్తులో సహకరించేందుకు ఇందులోని సైబర్‌క్రైం ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్‌ ద్వారా మభ్యపెట్టి మహిళల్ని, చిన్నారుల్ని అక్రమ రవాణా చేయడం వంటి వ్యవస్థీకృత నేరాలపై ఈ ల్యాబ్‌ ఓ కన్నేసి ఉంచనుంది. రాష్ట్ర వ్యాప్తంగా షీ బృందాలకు, లైంగిక అక్రమ రవాణా నిరోధక బృందాలకు (యాంటీ హ్యూమన్‌ ట్రాఫిక్‌ యూనిట్లకు) నిరంతరం దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నారు.

ఆయా నేరాల నియంత్రణ, దర్యాప్తులో పాటించదగ్గ ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించడంలో ఇది ఇప్పటికే కసరత్తు ఆరంభించింది. అలాగే ఠాణాల వారీగా పోలీస్‌ సిబ్బందికి డిజిటల్‌ నేరాల నియంత్రణ, కేసుల ఛేదనకు సంబంధించిన అవగాహననూ దీని ద్వారా కల్పించనున్నారు. రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు మరింత భద్రత కల్పించేందుకు ఈ ల్యాబ్‌ దోహదపడుతుందని మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్