Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ గోదారమ్మ ఉగ్రరూపం - కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న నీటి మట్టం

Advertiesment
godavari floods
, మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (08:57 IST)
గోదారమ్మ మరోమారు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి వరద నీరు మరోమారు పోటెత్తింది. ఫలితంగా కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్షణక్షణానికి పెరిగిపోతోంది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తూ, ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. 
 
ఇక వాగులు, వంకలు సంగతి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను స్థానిక అధికారులు అప్రమత్తం చేశారు. పైగా, కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతుండంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌‍ఫ్లో, ఔట్‌ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
 
కొమరం భీమ్ జిల్లాలో కుండపోత వానలకు కాగజ్ నగర్ మండలంలోని అందువల్ల వంతెన మరింతగా కుంగిపోయింది. గత నెలలోనే ఈ వంతెన ప్రమాదకరస్థితికి చేరుకున్న విషయం తెల్సిందే. ఇపుడు మరింతగా కుంగిపోవడంతో ఈ వంతెనపై వాహనరాకపోకలను నిలిపివేశారు. అయినప్పటికీ స్థానికులు కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. 
 
అలాగే, ములుగు జిల్లాలో భారీ వర్షాలకు బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తింది. జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 
 
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల వాసులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ లాడ్జిలో అగ్నిప్రమాదం - 8 మంది మృతి