గృహ విద్యుత్ బిల్లుల్లో రెట్టింపు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, మార్చి నెలలో బిల్లు రీడింగ్ తీయకపోవడం, ఏప్రిల్ బిల్లుతో కలిపి హెచ్చు రీడింగ్ తీసి స్లాట్లు మార్చి వినియోగదారులకు వేలల్లో బిల్లుల వడ్డింపులు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సోమవారం ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, లాక్డౌన్ వలన దెబ్బతిన్న ప్రజలు ఈ భారం మోసే పరిస్థితిలో లేరు కనుక విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ చార్జీలు చెల్లించాలని పేర్కొన్నారు. మరోపక్క వలస కార్మికుల వద్ద రైలు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
గత 50 రోజులుగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొని ప్రభుత్వాలకు సహకరించారని , కానీ ఆదుకోవలసిన ప్రభుత్వాలు పెట్రోల్ , కరెంట్ తదితర ప్రజావసరాల చార్జీలు పెంచి వారి నుంచి డబ్బులు పిండుకుంటున్నారని విమర్శించారు.
కేంద్రం మార్చి నెలలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 ఎక్సైజ్ సుంకం పెంచి, మరల మే నెలలో పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13లు పెంచి ఖజానాను నింపుకుందన్నారు. అంతర్జాతీయ ఆయిల్ ధరలు కనీస స్థాయికి పడిపోయినా పెట్రోల్ ధరలు తగ్గించలేదన్నారు. దీనికి తోడు రాష్ట్రాలు వ్యాట్ పెంచుతూ కేంద్రంతో పాటు వినియోగదారులపై భారాన్ని మోపుతూనే ఉన్నాయన్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో కూలీలు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో సరైన ఆదాయానికి నోచుకోలేదన్నారు. వీరిపై పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రభుత్వాలు మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు . ఉద్దీపన చర్యలు తీసుకోకపోగా ధరలు పెంచడం శోచనీయమన్నారు.
రాష్ట్రం ప్రతి కుటుంబానికి రూ.1000, కేంద్రం రూ.500 మినహా బీద, బలహీన కుటుంబాలకు గత రెండు నెలలుగా ఇచ్చిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఖాతాల్లోకి రూ. 10 వేలు వేసి వారిని ఆదుకోవాలన్నారు.
వెంటనే ఉపసంహరించుకోవాలి: బీజేపీ నేత కన్నా లేఖ
విద్యుత్ చార్జీలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం లేఖ రాశారు. కరోనా విపత్తు వేళ పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని లేఖ ద్వారా కోరారు.
విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆయన సూచించారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలు రద్దు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
ఛార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య: కళా వెంకట్రావు మండిపాటు
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచుతూ వెళ్లిపోతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలకు జగనన్న విద్యుత్ దీవెన పథకం అని పేరు పెట్టుకోండని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ వేళ ప్రజలకు అండగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచి ఇబ్బందులు పెడుతోందని ఆయన విమర్శించారు. వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.