సీఆర్‌డీఏ పరిధిలో లేఅవుట్లకు నిబంధనల సడలింపు... మంత్రి నారాయణ
రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పరిధిలో లేఅవుట్ల నిబంధనలు సడలించాలని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం రెండవ బ్లాక్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలసి
రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పరిధిలో లేఅవుట్ల నిబంధనలు సడలించాలని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం రెండవ బ్లాక్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు సీఆర్‌డీఏ పరిధి(గతంలో ఉడా)లో 500 మీటర్ల లోపల వరకు అనుమతులు ఇచ్చేవారని మంత్రి నారాయణ తెలిపారు.
ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవతల 500 మీటర్లు దాటిన లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఆ లేఅవుట్లలో రోడ్లు, డ్రైన్ల వంటి మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చును వారే భరించవలసి ఉంటుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు బయట 1,255 ఎకరాల్లో లేఅవుట్లు సీఆర్డీఏ వద్ద ఉన్నట్లు తెలిపారు. కొత్తగా రూపొందించే నిబంధనలకు లోబడి వాటికి అనుమతులు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
‘ఉడా’లు అన్నిటిలో ఒక రకమైన నిబంధనలు
రాష్ట్రంలోని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఉడా)లన్నింటిలో ఒకే విధమైన నిబంధనలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఒక్కో పట్టణాభివృద్ధి సంస్థలో ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయని, వాన్నిటినీ ఒకే విధంగా రూపొందించనున్నట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరగవలసిన అవసరం ఉందని, పెట్టుబడులు రావాలని, ఉద్యోగ అవకాశాలు పెరగాలని మంత్రి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ విషయాలపై ఈ రోజు చర్చించినట్లు మంత్రి యనమల చెప్పారు.