ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న మహానాడుపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్లు, ఆహ్వానాలు, తీర్మానాలు సహా పలు అంశాలపై ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది డిజిటల్ వేదికగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.
ముఖ్యంగా మహానాడు వేదికపై ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై చర్చించారు. అమరులైన పార్టీ నేతలకు, కోవిడ్ మృతులకు సంతాపం తెలుపుతూ తొలి తీర్మానం ప్రవేశపెట్టాలన నిర్ణయించారు. అనంతరం యుగపురుషుడు ఎన్టీఆర్ గారికి నివాళి తెలియజేయనున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్లక్ష్యం, ఆక్సిజన్ అందక కరోనా బాధితుల మృతి, వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ చేతకానితనం తదితర అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టాలని నేతలు సూచించారు.
వ్యవసాయం, సాగు నీటిపారుదల రంగాల నిర్వహణలో ప్రభుత్వ అవగాహనాలోపం, చిత్తశుద్ధి లేమి, రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై కూడా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. రెండేళ్లలో జగన్ రెడ్డి చేతకాని తనంతో చేసిన అప్పులు, పెంచిన పన్నుల కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఉపాధి లేమి, కొరవడిన ఆదాయం, పన్నుల భారాన్ని ఖండిస్తూ మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టాలని నేతలు సూచించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా వ్యక్తిగత కక్షతో పలు పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్నింటిని బలవంతంగా మూయించారు. మరికొన్నింటిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ టెర్రరిజం కారణంగా రాష్ట్రంలో పెరిగిపోయిన నిరుద్యోగంపైనా, అమరావతిని విచ్ఛిన్నం చేయడం ద్వారా రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిన విధానంపైనా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
జగన్ రెడ్డి నకిలీ నవరత్నాలు, నమ్మక ద్రోహం చేస్తున్న సంక్షేమంపై తీర్మానం చేయనున్నారు. వైన్, మైన్, ల్యాండ్ శాండ్ పేరుతో పంచభూతాలను మింగేస్తున్న తీరును ఎండగడుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని ప్రతిపక్షాలు, మీడియాపై దాడులు, ప్రశ్నించిన వారి ఆస్తుల ధ్వంసంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణింపజేసిన విధానంపైనా తీర్మానం చేయాలని నిర్ణయించారు.
అదే విధంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పటిష్టతతో పాటు ప్రభుత్వ అధికార దుర్వినియోగం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను జగన్ రెడ్డి రెచ్చగొడుతూ రాజ్య హింసకు పాల్పడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం చేయాలని నేతలు సూచించగా చంద్రబాబు నాయుడు ఆమోదించారు.