తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై పెట్రోలు ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసే వరకూ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి శనివారం పోలీసు స్టేషనుకు వెళ్లి సంతకం పెట్టాలని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు శనివారం నాని స్టేషనుకు వచ్చి సంతకం పెట్టి వెళ్లారు. గతంలో ఈ కేసులో నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆపై హైకోర్టు సూచన మేరకు గుడివాడ కోర్టుకు వెళ్లడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే, ప్రతీ మంగళవారం, శనివారం గుడివాడ వన్ టౌన్ స్టేషనులో సంతకం పెట్టి వెళ్లాలని సూచించారు. ఆపై దాన్ని కోర్టు శనివారం ఒక్క రోజుకే కుదించింది.
సాధారణంగా కోర్టులు సంబంధిత కేసులో ఛార్జిషీటు దాఖలు చేసేవరకూగాని, రెండు నెలల కాలవ్యవధితో గాని షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తాయి. కానీ ఈ కేసులో రెండు నెలల కాల వ్యవధి పూర్తయినా, ఛార్జిషీటు దాఖలు చేయని కారణంగా మరో రెండు వారాల పాటు కొడాలి నాని స్టేషన్‌కు రావాల్సి వస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
వైకాపా మాజీ మంత్రులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని)లు శనివారం గుడివాడలోని కొడాలి నాని ఇంట్లో భేటీ అయ్యారు. చాలాకాలం తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.