Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల్లూరులో గ్రామ వలంటీరుకు సోకిన కరోనా - ఏపీలో వెయ్యి దాటిన కేసులు

Advertiesment
నెల్లూరులో గ్రామ వలంటీరుకు సోకిన కరోనా - ఏపీలో వెయ్యి దాటిన కేసులు
, ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (18:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంది. ఈ వైరస్ వ్యాప్తి చూస్తుంటే ఇప్పట్లో అడ్డుకట్టపడేలా లేదు. ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు దాదాపుగా వెయ్యికి చేరువయ్యాయి. ఆదివారం కూడా మరో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా తడలో ఓ గ్రామ వలంటీరుకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆమెను నెల్లూరు పెద్దాసుపత్రికి తరలించారు. 
 
నెల్లూరు జిల్లాలోని తడ మండలం అక్కంపేటలో ఈ మహిళా వలంటీరు పని చేస్తోంది. ఈమె స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇటీవల ఆ గ్రామంలో నిత్యావసర సరకులు, కూరగాయలను పంపిణీ చేసింది. ఆ తర్వాత ఆమెకు జలుబు, దగ్గు, జ్వరం రావడంతో అనుమానం వచ్చి అధికారులకు సమాచారం చేరవేసింది. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది.
 
ఆ వెంటనే ఆ వలంటీరును నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఆమె కాంటాక్ట్ అయిన వారందరినీ హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించి ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు ప్రటించారు. అయితే, ఈ వైరస్ సోకక ముందు ఆ గ్రామ వలంటీరు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కొద్దిరోజులు గడిపింది. తన సోదరుడుకి ఆపరేషన్ చేయగా, అతనితో కలిసి ఆస్పత్రిలో ఉన్నది. ఆ తర్వాత గ్రామానికి వచ్చి విధుల్లో చేరింది. 

కాగా, గత 24 గంటల్లో కొత్తగా 81 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో కొత్తగా 4, గుంటూరులో 3, కడపలో 3, అనంతపురంలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 52, ప్రకాశం జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.
 
ఏపీలో విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,097కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 279, గుంటూరులో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 835గా ఉంది. 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రోగి అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు