కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దేశాలకు దేశాలనే చుట్టేస్తోంది. తాజాగా స్కాట్‌ల్యాండ్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఓ వ్యక్తికి వైరస్ సోకడంలో కొత్తేముంది అనేదే కదా మీ సందేహం. అయితే, ఇక్కడ కరోనా వైరస్ సోకింది ఏకంగా 13 మంది పిల్లల తండ్రి. ఆయన పేరు రాయ్ హన్. దీంతో ఆ పిల్లలంతా ఇపుడు హడలిపోతున్నారు. పైగా, ఈ ఫ్యామిలీకి స్కాట్లాండ్‌లో ప్రత్యేక గుర్తింపుకూడా ఉంది.
స్కాట్లాండ్‌లోని డుండీలో అతిపెద్ద కుటుంబంగా వారిని గుర్తిస్తారు. నైన్‌వెల్స్ హాస్పిటల్‌లో రాయ్ నర్సుగా పనిచేస్తున్నాడు. కరోనా వ్యాధిగ్రస్తులకు ఆయన చికిత్స అందిస్తున్నాడు.
అయితే ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్ ధరించి చికిత్స అందించినా.. అతనికి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షలో అతను పాజిటివ్‌గా తేలాడు.
హన్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. రాయ్ హన్‌తో పాటు అతని ఇంట్లో ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు. హన్ పిల్లల వయసు అయిదేళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.