కరోనా కేసుల ఉధృతి తగ్గని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పున:ప్రారంభించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే పలు పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కలవరం చెందుతున్నారు.
అటు దశల వారీగా డిసెంబరు నాటికి మొత్తం పాఠశాలల్ని పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. ఈ నెల 2 నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్ ద్వితీయ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు విద్యార్థుల హాజరు శాతం అతి తక్కువగా నమోదైంది. పాఠశాలల్ని దాదాపు పూర్తి స్థాయిలో తెరచుకున్నప్పటికీ, విద్యార్థుల హాజరు తగినంతగా లేదు.
ఈ కేసులతో పాఠశాలలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. చిత్తూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, కర్నూలు, గుంటూరు, విశాఖ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా కేసులు నమోదయ్యాయి. వారంతా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులే కావడం గమనార్హం. ఆన్‌లైన్ పాఠాల్లో సందేహాల నివత్తి కోసం స్కూళ్లకు వెళ్ళిన పలువురు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా సోకింది.
టెస్టుల్లో భారీగా పాజిటివ్ కేసులు
తల్లిదండ్రుల అనుమతితో స్కూళ్లకు వస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులకు నిర్వహిస్తున్న టెస్టుల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. చదువు కోసం వచ్చిన చిన్నారులకు కరోనా సోకడం, వారి వల్ల కుటుంబ సభ్యులకు విస్తరించడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
గుంటూరు జిల్లాలో పలు స్కూళ్లలో కరోనా కేసులు వెలుగు చూశాయి. పశ్చిమగోదావరి జిల్లా స్కూళ్లలోనూ అదే పరిస్థితి దాపురించింది. కరోనా కేసుల ఉధృతితో పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా టెస్టులను తప్పనిసరి చేస్తున్నారు.
తగ్గుతోన్న విద్యార్థుల హాజరు
పాఠశాలలకు వచ్చే 9, 10 తరగతుల విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ తగ్గిపోతోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 5వరకు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతాన్ని పరిశీలిస్తే తగ్గుముఖం పట్టింది. తొలిరోజున మొత్తం 98.84శాతం పాఠశాలలను తెరవగా, 5వ తేదీన ఆ సంఖ్య 99.92కు చేరింది. ఐదు రోజుల్లోనే విద్యార్థుల హాజరు శాతం తగ్గడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది.
పాఠశాలల నిర్వహణపై పునరాలోచించాలి
రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. పాఠశాలలు తెరచి మూడు రోజులు కాకముందే పలువురు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సిబ్బందికి కరోనా సోకటం శోచనీయని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజునే ప్రకాశం జిల్లాలోని మోడల్ స్కూల్లో ముగ్గురు విద్యార్ధులతో సహా ఒక ఉపాధ్యాయురాలు కరోనాకు గురయ్యారని వివరించారు.