Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాను శరీరంలోకి ఆహ్వానించవద్దు

Advertiesment
కరోనాను శరీరంలోకి ఆహ్వానించవద్దు
, శుక్రవారం, 6 నవంబరు 2020 (08:52 IST)
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 పేరుతో ఇప్పటికే దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. ప్రజలు కూడా తమ రోజువారీ కార్యక్రమాలలో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం, మనదేశంలోనూ మరోసారి కరోనా వ్యాప్తి ఉండొచ్చన్న ప్రచారం కూడా పెద్దఎత్తున జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కూడా కరోనా ముప్పు తొలగిందన్న అంచనాకు రాకుండా మరికొంతకాలం మాస్కు ధరించడం, ఇతరులతో కలిసి ఉన్నపుడు కనీసం ఆరడుగుల దూరం పాటించడం, శానిటైజర్ లేదా తరచూ సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనే మూడు విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. 
 
ప్రస్తుతం అనేక మంది ప్రజలు జనసంవర్థమైన ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు ముఖానికి మాస్కు ధరించడం లేదు. మరికొంత మంది మాస్కులు ధరించినా.. వాటిని వినియోగించడంపై సరైన అవగాహన లేకపోవడం, మాస్కును నిమిషానికి ఒకసారి తడుముకోవడం, కిందకు లాగడం, పైకి పెట్టడం, ముక్కు కిందకు లాగడం, మెడపైన, తలపైన ఉంచడం చేస్తున్నారు.
 
మరికొందరు వాటిని జనం సమూహాల్లోనే ఎక్కడపడితే అక్కడ తీసేస్తూ.. ముఖాన్ని చేతులతో తుడుచుకుని మాస్కును తిరిగి పెట్టుకుంటున్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో నగరాల్లో మాస్కులు ధరిస్తూనే ప్రజలు చేస్తున్న పొరపాట్లను ఇక్కడ వివరించడం జరుగుతోంది.
 
 మాస్కులను ధరించే ప్రతి ఒక్కరూ వీటిని గమనించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
మాస్కు ధరించినపుడు ఎక్కువమంది చేస్తున్న పొరపాట్లు:
1) ఆఫీసులో రోజూ సహచర సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. అందరం కలిసే ఉంటున్నాం కదా.. ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో మాస్కు అవసరం లేదనుకుంటాం. అది తప్పు. ఆఫీసులో ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కు  ధరించాలి. 
 
2) మనం మన ప్రాణ స్నేహితులతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాం. వాళ్లు నా ఆప్త మిత్రులేకదా. వారితో మాట్లాడేతప్పుడు మాస్కు అవసరం లేదనుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడినా మాస్కు ధరించడం శ్రేయస్కరం. 
 
3) కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాస్కు అవసరం లేదనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు.  ఇంట్లోనూ ఎవరైనా పెద్దవారుంటే వారితో మాట్లాడినా మాస్కు ధరించడం మంచిది. 
 
4) మరికొంత మందికి మాస్కు నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచాలన్న విషయం కూడా తెలియడం లేదు. చాలామంది మాస్కులను చేతితో పట్టుకుని, చెవికి వేలాడదీస్తూ ఇతరులతో కబుర్లు చెప్తూ ఉంటారు. అలా చేయకూడదు. జనంలోకి వెళ్లినపుడు వైరస్ బాధితులు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపర్లు మన ముఖంపై పడకుండా చూసే రక్షణ కవచమే మాస్కు.  
 
5) మాస్కును ధరించిన తర్వాత తరచూ చేతితో మాస్కును ముట్టుకోవడం, కళ్లు, ముక్కు, నోటి దగ్గర చేతిని పెట్టుకుని రుద్దడం అస్సలు చేయకూడదు. కరోనా వైరస్ అనేది 99శాతం మన చేతుల ద్వారానే ముక్కు, నోరు, కంటిలోనికి ప్రవేశించి శరీరంలోకి వెళ్తుంది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు ప్రతి నిమిషానికొకసారి మాస్కును చేతులతో రుద్దడం, ముఖాన్ని తాకడం చేస్తున్నారు. 
 
6) చేతులు కలపడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అస్సులు చేయవద్దని చెబుతున్నప్పటికీ ప్రజలు పెద్దగా ఈ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికీ చాలా మంది యువత జనసమూహాల్లోనూ చేతులు కలుపుతూ, ఒకరికొకరు ముఖం దగ్గరగా పెట్టుకుని మాట్లాడుకోవడం చేస్తూనే ఉన్నారు. 
 
7) సెల్ ఫోన్ లో మాట్లాడేతప్పుడు చాలా మంది మాస్కులు తొలగించి మాట్లాడుతున్నారు. ఒక్కరే ఉన్నపుడు అలా చేయడం తప్పులేదు. కానీ జనసంవర్థమైన ప్రాంతాల్లో కూడా ముఖానికి మాస్కు తొలగించి ఫోన్ లో మాట్లాడుతూ.. చేతితో ముఖాన్ని తాకుతున్నారు. అలా చేస్తున్నారంటే మన శరీరంలోకి కరోనాను రమ్మని మనమే ఆహ్వనించినట్టే.
 
8) చాలా మంది మాస్కు ధరించిన తర్వాత మధ్యలో తొలగించి చెమట తొలగించుకోవడం లాంటివి చేస్తున్నారు. చొక్కాతో, మెడలో ఉండే కండువాతో తుడుచుకుంటున్నారు. కరోనా బాధితులెవరైనా తుమ్మినపుడు తుంపర్ల రూపంలో వైరస్ వచ్చి మన చొక్కాలపై పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. చాలా మంది మాస్కును తొలగించి ఆ చొక్కాతో ముఖం తుడుచుకోవడం ద్వారా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. 
 
9) మరికొంతమంది మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించే వస్తున్నారు. అయితే తెలిసిన వారెవరైనా కనిపించగానే మాస్కును కిందకులాగి కులాసాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే తమను వైరస్ బారినపడేలా చేస్తుందనే విషయం తెలియక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. 
 
మాస్కులను శుభ్రం చేయడం:
* మనం ధరించే క్లాత్ మాస్కును ప్రతిరోజూ ఉతకాలి. ఫేస్‌ మాస్క్ ను రెండు లేదా మూడురోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్టే. మాస్క్‌ ధరించిన ప్రతిసారి దాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.  
 
*  మాస్కులను చన్నీటిలో శుభ్రం చేస్తుంటారు కొందరు. అలాకాకుండా వేడినీళ్లతో మాస్కులను శుభ్రం చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. 
 
* ఒకవేళ మాస్కులను చల్లని నీటితో శుభ్రం చేసినా తప్పకుండా ఎండలోనే ఆరేయాలి. ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఇస్త్రీ పెట్టెతో వేడి చేసి తర్వాత ఉపయోగించాలి. 
 
* క్లాత్ తో చేసిన మాస్కులను వాషింగ్‌ మిషన్‌లో వేడినీళ్లు లేదా సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేయాలి. తరువాత ఎండలో ఆరవేయాలి లేదా ఒక గ్యాస్ పై వేడినీటిలో కనీసం 15 నిమిషాలు ఉంచి ఎండలో ఆరబెట్టవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదరణ మరింత పెంచేలా కార్యక్రమాలు: ఎస్వీబీసీ చైర్మన్ కు టీటీడీ చైర్మన్ సూచన