Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో జనవరి 15వ తేదీ నుంచి కరోనా సెకండ్‌ వేవ్?

ఏపీలో జనవరి 15వ తేదీ నుంచి కరోనా సెకండ్‌ వేవ్?
, ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:32 IST)
ఏపీలో జనవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలో జూన్‌ నుంచి అక్టోబరు చివరి వరకూ వైరస్‌ భయోత్పాతం సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రతి రోజు దాదాపు పది వేల కేసుల వరకూ నమోదయ్యాయి. తర్వాత నవంబరు మొదటి వారం నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 500 కేసులు వస్తున్నాయి.
 
అమెరికా, రష్యా, ఇటలీ వంటి దేశాల్లో కూడా ఇదే మాదిరిగా కేసులు ఆకస్మాత్తుగా తగ్గిపోయి... మళ్లీ 3 నుంచి 5 నెలల వ్యవధి మధ్యలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని.. మన దేశంలో ఢిల్లీ, కేరళ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా సెకండ్‌ వేవ్‌ మొదలైందని నిపుణులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు కూడా అందించారు.

ఆ నివేదిక ఆధారంగా ఈ నెల మూడో వారం నుంచి మరోసారి కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలి విడత లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగా కఠినతర ఆంక్షలను ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిబంధనల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు, మార్కెట్లు, మాల్స్‌, సినిమా థియేటర్లలో కొన్ని ఆంక్షలు అమలు చేయనుంది. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని బట్టి కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి మార్కెట్‌ జోన్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో కొంత వరకూ ప్రజలు పనులు చేసుకునేందుకు అనుమతిస్తారు.

ఇదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు చిన్నారులను ఇంటి వద్దనే ఉండాలని సూచిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో హైరిస్క్‌ ఉన్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై మందుగానే సమాచారమిస్తారు. భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రజలంతా మాస్క్‌, శానిటైజర్‌, మాస్కులను ఉపయోగించడం తప్పనిసరి చేయనున్నారు. 
 
త్రీ ‘సీ’లు అమలు...
తొలి విడత కరోనా కేసుల్లో ప్రభుత్వం త్రీ ‘టీ’లను (టెస్ట్‌, ట్రీట్‌, ట్రేస్‌) పాటించింది. రెండో విడతలో త్రీ ‘సీ’లను అమలు చేయనుంది. అంటే కాంటాక్ట్‌, క్లోజ్డ్‌, క్రౌడ్‌ నుంచి ప్రజలు తప్పించుకునేందుకు మాస్కు ధరించడం, శానిటైజింగ్‌, ఇంటి వద్దనే ఉండడం అనే మూడు సూచనలు చేయనుంది. దీనిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేయనుంది.
 
మందులు సిద్ధం చేసుకోండి..
సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆరోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లపై నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, ప్రత్యేక పడకలు, ఐసీయూ, వెంటిలేటర్లు, అంబులెన్సులు సిద్ధం చేసుకోవాలి. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి. దీని కోసం ముందుగానే సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

కరోనా నివారణ జాగ్రత్తలపై గ్రామాల్లో ఆశాలు, ఏఎన్‌ఎంలతో అవగాహన కల్పిస్తారు. వీటికి సంబంధించి ప్రత్యేక పోస్టర్లు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలి. మీడియాలో ప్రత్యేక ప్రకటనలివ్వాలి. ప్రముఖ సినీనటులు, క్రీడాకారులతో మాస్కు, శానిటైజర్ల వాడకం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిపై ప్రచారం చేయించాలి.
 
న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం
సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలను నిషేధించనున్నట్లు తెలిసింది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకూ అన్ని రకాల వేడుకల రద్దు దిశగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 31న, జనవరి 1న రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ విధించాలని యోచిస్తోంది. వైన్‌షాపులు, బార్ల  సమయాల్ని కుదిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటో డ్రైవర్ కుమార్తెకు నీట్‌లో సీటు