గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా వైరస్ సోకింది.
ఢిల్లీ నుండి వచ్చిన ఒక వ్యక్తి వల్ల నగరంలోని పాతగుంటూరు కుమ్మరి బజార్‌కు చెందిన ఒక కుటుంబానికి కరోనా సోకిందని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ చెప్పారు. ఆ కుటుంబానికి చెందిన 13 మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.
వీరిలో ఇద్దరికి మినహా మిగిలిన వారందరికి కరోనా వ్యాపించింది. బాధితుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వీరందరిని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు.
తాజా సంఘటనతో గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75కు చేరింది. వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారే 57 మంది ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరుకుంది. శనివారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి.