అనారోగ్యం పాలైనవారు వెంటనే తమను సంప్రదించాలని ఏపీ ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కోవిడ్19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధాతథంగా...
1) ఎవరికైనా ఎలాంటి అనారోగ్యం ఉన్నా ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నపుడు వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించండి. టెస్టులు ప్రభుత్వ పరంగా ఉచితంగా చేయడం జరుగుతుంది.
అలాంటి వారు ఒకవేళ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లో ఉండడానికి అనుమతి ఇవ్వబడుతుంది. కానీ ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
ఎలాంటి నిస్సందేహం కానీ, క్వారంటైన్ అనే భయం లేకుండా స్వచ్చంధంగా ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను వినియోగించుకుంటూ ముందుకు రావాల్సిందిగా వైద్యశాఖ విజ్షప్తి
2) ముఖ్యంగా శ్వాసకు సంబంధించినటువంటి ఆస్తమా, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు ప్రభుత్వ వైద్య సిబ్బందిని సత్వరమే సంప్రదించవలసినది.
కోవిడ్ వ్యాధి తీవ్రత వీరిపై ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది కనుక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించగలరు. అదే విధంగా గుండెజ బ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినది.
3) ఇంట్లో మనతోపాటు ఉన్న 60ఏళ్ల వయసు పైబడిన పెద్దవారిని వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వీరికి ప్రత్యేక గదితోపాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలి. చక్కటి పౌష్టికాహారం అందిస్తూ ఉండాలి. వారిని సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండేటట్లు చూడాలి. వీరికి ఎలాంటి రోగ లక్షణాలు కనిపించినా నిస్సంకోచంగా ప్రభుత్వ వైద్య సిబ్బందిని వెంటనే సంప్రదించాలి.
4) ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించాలి. బయటకు వెళ్లినపుడు మాస్క్ ధరించడం అనివార్యం. చెప్పులను ఇంటి బయటే వదిలివేయాలి. తరచూ తాకే ప్రదేశాలను, వస్తువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
వీలైనన్ని ఎక్కువసార్లు సబ్బు లేదా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ కూరగాయాలు, సరుకుల కోసం వెళ్లినపుడు ఖచ్చితంగా శానిటైజర్ ను వెంట తీసుకెళ్లాలి. నీటితో కడగడానికి ఆస్కారం ఉన్న సరుకులు, కూరగాయలు, పాలప్యాకెట్ లాంటి వాటిని శుభ్రపరచాలి.
5) మరింత సమాచారం కోసం కింద సూచించిన ప్రభుత్వ మాధ్యమాలను సంప్రదించగలరు.
కరోనా వైరస్ గురించిన సూచనలు/సలహాలు/ఫిర్యాదుల కొరకు సంప్రదించండి: కాల్ సెంటర్: 104, 0866-2410978