జగన్ - పవన్ కలిస్తే చంద్రబాబు గెలుపు నల్లేరుపై నడకేనట.. ఎలా?
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు కలిసి పోటీ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు నల్లేరు
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు కలిసి పోటీ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు నల్లేరుపై నడకలా సాగుతుందని కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెపుతున్నారు.
ఆయన శుక్రవారం మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఈ రెండు పార్టీలను వెనుకుండి బీజేపీ నడిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలు నడిపిందో, ఈరోజున ఏపీలో బీజేపీ అలాంటి రాజకీయ క్రీడ నడపబోతోందనే విషయం రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
ఇకపోతే, జగన్, పవన్‌లకు ఎవరి సమీకరణాలు వారికున్నప్పటికీ, వాళ్లిద్దరిని బీజేపీ డైరెక్టు చేస్తోందనే విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతిఒక్కరికీ అర్థమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ-బీజేపీ కలిసి పోటీ చేయవని, అదే, వైసీపీ-జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందన్నారు. అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబునాయుడిని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని, కొంతమేరకు ఆ అభిప్రాయం నిజమని అన్నారు.