Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీ

కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీ
, శనివారం, 4 జనవరి 2020 (17:13 IST)
కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం రేసు మొదలైంది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు పైనే పోటీ పడుతున్నారు. జడ్పీ పీఠాన్ని అన్‌ రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయిస్తూ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఎం.గిరిజా శంకర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు.

అధికార పార్టీ పొరపాట్లను క్యాష్‌ చేసుకునే దిశగా టీడీపీ యత్నిస్తోంది. అయుతే ఈసారి బీజేపీ కూడా బరిలో దిగేందుకు తహతహలాడుతోంది. వైసీపీ నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి కుటుంబం పోటీకి సిద్ధపడుతుండగా.. మరో నాయకుడు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

టీడీపీ నుంచి కోట్ల, కేఈ కుటుంబాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నుంచి విడిపోయి వైసీపీకి మద్దతిచ్చి ఇపుడు బీజేపీ వైపు చూస్తున్న మరో నాయకురాలు కూడా జడ్పీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.
 
ఆలూరు నియోజకవర్గం నుంచి కూడా ఓ అభ్యర్థి జడ్పీ పదవి కోసం యత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొనసాగిన ఆ నాయకురాలు కోట్ల కుటుంబం చేరికతో విబేధించి వైసీపీకి ఎన్నికల్లో మద్దతిచ్చారు. ప్రస్తుతం ఆమె పలు కారణాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

దేవనకొండ మండలం నుంచి ఆ నాయకురాలు పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ సారి బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఆమె యత్నిస్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయ సేకరణ అనంతరం తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిసింది.

టీడీపీ నుంచి బీజేపీలో ఆర్నెళ్ల కిందట చేరిన ఓ రాజ్యసభ సభ్యుడి ద్వారా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆ పార్టీ తరపున మండలంలో జెండా ఎగరేసే ఆలోచనలో ఉన్నారు. మెజార్టీకే మొగ్గు చూపే క్రమంలో అవకాశముంటే జడ్పీ చైర్‌పర్సన్‌గానూ పదవి చేపట్టే అవకాశాలు లేకపోలేదు.
 
స్థానిక ఎన్నికలు ఎపుడొచ్చినా పోటీకి టీడీపీ జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతరం కార్యకర్తల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగిస్తూ కింది స్థాయిలో నాయకులను బలపరుచుకుంది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ప్రజల్లో వ్యతిరేకత పలు అంశాలను కూడా ఓటర్లలోకి బలంగా తీసుకెళ్తున్నారు.

జిల్లా నాయకులు పలు చోట్ల ఆశావహులకు ఇప్పటికే హామీలు ఇచ్చారు. అయితే గురువారం జారీ అయిన జడ్పీటీసీ, ఎమ్‌పీపీ రిజర్వేషన్ల ఖరారుతో ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై నాయకులు కుస్తీలు మొదలుపెట్టారు. కేఈ, కోట్ల కుటుంబాలు మూడ్రోజుల్లో నిర్ణయాలను వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే వైసీపీ నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి కుటుంబం జడ్పీ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికలకు ముందే జగన్మోహన్‌రెడ్డి నుంచి ఆయన హామీ తీసుకున్నట్లు ప్రచారం ఉంది. త్వరలోనే అధినేతను కలిసి అభ్యర్థి పేరును ఖరారు చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రయత్నాలు సఫలమైతే ఆ అభ్యర్థి ఉయ్యాలవాడ, చాగలమర్రి మరేదేని జనరల్‌కు రిజర్వేషన్‌ ఖరారైన మండలం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే పత్తికొండ మండలం నుంచి మరో నాయకుడు కూడా తన సతీమణిని ఆ పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పోటీలో ఎస్వీ మోహన్‌రెడ్డి తరపు అభ్యర్థి నిలిస్తే స్వచ్ఛందంగా తప్పుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా జడ్పీ పీఠంపై కన్నేస్తూ పలువురు నాయకుల ద్వారా అధినేతల హామీలను సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్లకే ఓటు హక్కు