మేడ్చల్ జిల్లాలో ఓ బొగ్గుల కుంపటి నలుగురి ప్రాణాలు తీసింది. వెచ్చదనం కోసం వెలిగించిన ఈ కుంపటి కారణంగా చివరకు నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పాలమూరు జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలం బొమ్రాస్‌పేట గ్రామశివారులో ఉన్న ఓ కోళ్ళఫారంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. యువకులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విచారణలో బొగ్గుల కుంపటి వల్లే నలుగురు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. రాత్రి కోళ్లకు టీకాలు వేసిన తర్వాత నలుగురు యువకులు మద్యం సేవించారు. గదిలోకి వెళ్లిన తర్వాత వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటిని వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసివేయడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు.