ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు శాసనమండలి మోకాలొడ్డినా రాజధాని తరలింపు మాత్రం ఆగదని తనను సంప్రదించిన మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు సమాచారం. ముఖ్యంగా, సెలెక్ట్ కమిటీ నివేదిక ఇచ్చేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని, మనం విశాఖకు తరలివెళ్లేంది కూడా మార్చి తర్వాతేనని అందువల్ల ఆందోళన చెందనక్కర్లేదని వారితో జగన్ అన్నట్టు వినికిడి.
బుధవారం రాత్రి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు మండలి ఛైర్మన్ షరీఫ్ రూలింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పలువురు మంత్రులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రూల్ 154 ద్వారా తనకు లభించిన విచక్షణాధికారాలను ఉపయోగించి ఛైర్మన్ షరీఫ్ రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు. అయితే, దీనిపై టెన్షన్ వద్దని మంత్రులకు సీఎం చెప్పారు. ఈ పరిణామాలను ఊహించే... అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేశామని, దాని ఆధారంగా కార్యాలయాలను విశాఖకు తరలిస్తామని జగన్ సహచర మంత్రులకు చెప్పినట్లు సమాచారం.
'సెలెక్ట్ కమిటీ నుంచి బిల్లులు వచ్చేసరికి నెలో రెండు నెలలు అవుతుంది. ఒకవేళ మండలి బిల్లులను ఆమోదించినా... ఇప్పటికిప్పుడు రాజధాని మార్పు జరగదు కదా. ఎలాగూ మార్చి తర్వాతే సచివాలయాన్ని విశాఖకు తరలిస్తాం. ఈలోగా న్యాయపరమైన ప్రతిబంధకాలు లేకుండా.. శాఖాధిపతులను విశాఖకు తరలించే పని ప్రారంభిద్దాం' అని చెప్పినట్టు సమాచారం.
ఈ సందర్భంగా మండలి రద్దు ఊహాగానాలను కూడా జగన్ తోసిపుచ్చినట్లు తెలిసింది. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్‌కు కొందరు మంత్రులు చెప్పారు. అయితే.. వారెవరికీ హామీలు ఇవ్వవద్దని ఆయన వారించారు. మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకే చేరతాయన్నారు. మంగళవారం రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ సహా మరొకరి మాత్రమే అవకాశం కల్పిద్దామని, 2024 నాటికి మండలిలో టీడీపీకి ముగ్గురో నలుగురో ఉంటారని అందువల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు.