Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్‌కు క్లాస్ పీకిన అమిత్ షా : ఆ ఇద్దరి వ్యాఖ్యలే కొంప ముంచాయా?

సీఎం జగన్‌కు క్లాస్ పీకిన అమిత్ షా : ఆ ఇద్దరి వ్యాఖ్యలే కొంప ముంచాయా?
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (13:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్రం పిలుపు మేరకు ఆకస్మికంగా హస్తినకు వెళ్లిన ఆయన.. మంగళవారం రాత్రే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. వీరిద్దరూ 40 నిమిషాల పాటుల ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అమిత్ షా క్లాస్ పీకినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం... తాజాగా జగన్‌ సర్కారు, ఆ పార్టీ నేతలు న్యాయ వ్యవస్థపైనా వ్యక్తిగత దాడులకు దిగుతుండటాన్ని తీవ్రంగా పరిగణించింది. న్యాయమూర్తులపై ఎడాపెడా ఆరోపణలు గుప్పించి... మొత్తం న్యాయవ్యవస్థనే కించపరిచేలా వ్యవహరించడంతోపాటు, అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును కూడా ఇందుకు ఉపయోగించుకోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. 
 
కోర్టులపై వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినప్పటికీ... ఆ తర్వాత పార్లమెంటు ఆవరణలోనే వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు మీడియా ముందు అవే వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. వెంటనే వచ్చి తమను కలవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశం మేరకే... మంగళవారం జగన్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. 
 
ఈ సందర్భంగా జగన్‌కు షా క్లాస్ పీకినట్టు సమాచారం. 'న్యాయమూర్తులపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం, అందుకు పార్లమెంటును కూడా ఉపయోగించుకోవడం సరైంది కాదు. ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. రచ్చకెక్కడం మంచిది కాదు' అని జగన్‌కు షా చెప్పినట్లు తెలిసింది. వ్యవస్థలనే దెబ్బతీయాలనుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని చెప్పినట్లు తెలిసింది. 
 
అయితే, తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెబుతూ కొన్ని అంశాలతో కూడిన పత్రాన్ని అమిత్‌షాకు ఇవ్వగా... ఆయన అప్పటికి దానిని చూడకుండా పక్కనపెట్టేసినట్లు సమాచారం. దేశంలో న్యాయ వ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇస్తుండగా... చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూలేని విధంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే కోర్టులను టార్గెట్‌ చేయడం ఏమిటని షా నిలదీసినట్లు తెలిసింది.
 
'ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో అప్పీల్‌ చేసి తేల్చుకోవాలి. ఇది పద్ధతి కాదు' అని కఠినంగానే చెప్పినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో వైసీపీ నేతలు కోర్టులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం, ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం, దానికి ప్రభుత్వం వత్తాసుగా నిలవడం ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలిసింది. 
 
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంయమనంతో  ఉండాలని, విచక్షణారహితంగా వ్యవహరించడం తగదని అమిత్‌షా మందలించినట్లు తెలుస్తోంది.  మరోవైపు... ప్రజా ప్రతినిధులపై నమోదైన ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ కేసులను ఏడాదిలోపు పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్‌ తనపై ఉన్న కేసుల అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలతో పెట్టుకుంటే మాడి మసైపోవాల్సిందే : పరిపూర్ణానంద స్వామి