Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Revanth Reddy: నిఖార్సైన హైదరాబాదీ కొణిజేటి రోశయ్య : సీఎం రేవంత్

Revanth Reddy

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (08:40 IST)
CM Revanth Interesting Comments On K Rosaiah దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని ఆయన ఎపుడూ చెప్పేవారని గుర్తు చేశారు. రోశయ్య మూడో వర్థంతి వేడుక సందర్భంగా హైదరాబాద్ నగరంలో హైటెక్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీఎంలుగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇలాంటి వారంతా ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపించేందుకు కారణం రోశయ్య. సమస్యలను పరిష్కరించేందుకు వారికి కుడి భుజంలా ఆయన వ్యవహరించేవారు. 
 
అందుకే అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రులగా ఉన్నా నంబర్ 2 పొజిషన్ పర్మినెంట్. నంబర్ 1 పొజిషన్ మాత్రమే మారుతుండేది. ఎవరు సీఎం అయినా.. నంబర్ 2లో రోశయ్యే ఉండాలని కోరుకునేవారు. తెలంగాణ శాసనసభలో ఆయనలా వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే నేత లేకపోవడం లోటుగా కనిపిస్తోంది.
 
ఏనాడూ సీఎం కావాలని రోశయ్య తాపత్రయ పడలేదు. సందర్భం వచ్చినప్పుడు ఆయన్ను సోనియాగాంధీ ముఖ్యమంత్రిని చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంపిక చేశారంటే పార్టీకి రోశయ్య పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం ఎలాంటిదో చెప్పొచ్చు. ఏనాడూ పదవులు కావాలని అధిష్ఠానాన్ని ఆయన కోరలేదు. హోదాలన్నీ వాటంతట అవే వచ్చాయి. రోశయ్యను అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటే ఆర్యవైశ్యుల సహకారం అవసరం. వారి వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చే బాధ్యత తీసుకుంటా. పార్టీలోనూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం.
 
రెండు తెలుగు రాష్ట్రాలు నాకు సమానమేనని రోశయ్య చెప్పారు. 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో ఇల్లు కట్టుకున్నట్లు తెలిపారు. నిఖార్సయిన హైదరాబాదీ రోశయ్య అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఆయనకు నగరంలో విగ్రహం లేకపోవడం లోటు. ఆర్యవైశ్య నేతలు మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సూచన చేస్తే.. ఆర్అండ్ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం చేపడతాం. నాలుగో వర్ధంతి నాటికి దాన్ని పూర్తిచేస్తాం అని రేవంత్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SI Harish Suicide ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసు : యువతి అరెస్టు