గత నాలుగున్నరేళ్లలో పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. ఏ ఒక్కరికీ తీసిపోలేదు. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు సాధించేలా ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. మన మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99 శాతం నెర్చవేర్చాం. ప్రజాసంక్షేమ కోసం 124 సార్లు మీ కోసం బటన్ నొక్కాను. మీరంతా ఈసారి ఎన్నికల్లో నా కోసం రెండు బటన్లు నొక్కండి అని సీఎం జగన్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా మల్కాపురంలో వైకాపా ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో బహిరంగ సభ జరిగింది.
ఇందులో సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. 57 నెలలుగా పేదలకు అందుకున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ప్రచారం చేయండి. ఇంటింటా అభివృద్ధి, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికలతో ముడిపడివున్నాయని ప్రతి ఒక్కరికీ చెప్పండి. పేదవాడి భవిష్యత్ మీద, సంక్షేమం, వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు.
రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తుంది. చంద్రబాబు దుష్టసైన్యాన్ని, వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మన క్యాడర్, నాయకులు అభిమానులు సిద్ధం కావాలి. గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నాను. లంచాలకు తావు లేకుండా అభివృద్ధి చేశామని కాలర్ ఎగరేసి చెప్పవచ్చు. గత, ప్రస్తుత పాలనలోని తేడాలని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలు చూస్తే తెలుస్తుంది. పథకాలు అమలు కావాలంటే జగన్ వల్లే సాధ్యమని చెప్పండి. ప్రతిపక్షాలకు ఓటు వేయడమంటే స్కీముల వద్దకు ఆమోదం తెలిపినట్టే. గత ఎన్నికల్లో ఓడించి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఈసారితో తప్పిదాం. ఈ బెడద శాశ్వతంగా తప్పిస్తేనే చంద్రగ్రహణాలు ఉండవు అని సీఎం జగన్ అన్నారు.