మధ్యంతర బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలు మినహా రాబడికి రూ.30.80 లక్షల కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.11.11 లక్షల కోట్లు.. అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పులు : రూ.11.75 లక్షల కోట్లు, సవరించిన రెవన్యూ వ్యయం కోసం రూ. 44.90 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత దేశ అభివృద్ధికి రాబోయే ఐదేళ్ల కాలం స్వర్ణయుగం కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తమ సర్కారు కృషితో పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు.
పేదరిక నిర్మూలనకు రాబోయే రోజుల్లోనూ కృషి చేస్తామని, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్టుబడులకు స్వర్ణయుగంగా మారిందని నిర్మల చెప్పారు. విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత మధ్యంతర బడ్జెట్ లో రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వందే భారత్ ట్రైన్లతో రైల్వేలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. మిగతా రైళ్ల బోగీలను కూడా వందేభారత్ స్థాయిలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.