ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావిత గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు.
వారి కోసం ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. దీంతో..స్వయంగా పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించిన సీఎం జగన్.. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ఇరిగేషన్ శాఖ పైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్ అధికారుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు.
తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించారు. దాదాపు 23 -24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.