ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో జులైలో ఏపీ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంక్షేమ పథకాల జాబితాను కూడా ఏపీ ప్రభుత్వం ప్రటించింది. 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జులై నెలలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అందులో భాగంగా మొదటిది జగనన్న విద్యా కానుక-జులై 5న నగదు విడుదల చేస్తారు. వైయస్సార్ వాహనమిత్ర-జులై 13న, వైయస్సార్ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు-జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. మన పిల్లలను ప్రపంచంలోనే విద్యారంగంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నామని గుర్తు చేసినట్టు తెలుస్తోంది.
అలాగే బైజూస్ కంటెంట్‌ను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. 8వ తరగతి పిల్లలకు ఈ ఏడాది నుంచి ట్యాబ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తి చేసింది.
ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.7 లక్షల మంది పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వనుంది సర్కార్? 2025లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్న వారిని సన్నద్దం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.
ఇకపోతే.. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్ర ఆదాయంతో సంబంధం లేకున్నా.. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే సీఎం జగన్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. అమ్మ ఒడిని తమ మానసిక పుత్రికగా భావిస్తారు.
అందుకే అమ్మఒడి పథకానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా.. ఈ నెల 27వ తేదీని నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ భావించారు. అందులో భాగంగా ఈ నెల 27న తల్లుల ఖాతాలోకి అమ్మ ఒడి పథకానికి సంబంధించి అకౌంట్లో నేరుగా నగదు జమ కానుంది.
ఇప్పటికే ఏపీ కేబినెట్ సైతం దీనికి ఆమోదం తెలిపింది. దీంతో మొన్నటి జనవరి నుంచి నగదు ఎప్పుడు వస్తుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన ఈ పథకం విడుదల తేదీని జూన్ 27వ తేదీకి పెంచింది ఏపీ ప్రభుత్వం.