ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడి బాత్ రూమ్స్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వారు ఎదుర్కొనే పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 45 యేళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, 15 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి ఇలా గురుకుల పాఠశాలకు వెళ్లి మరుగుదొడ్లను తనిఖీ చేయడంపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో పాటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకారపన్నులపై కూడా ఆయన స్పందించారు. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆక్వా రంగం దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికపుడు సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు.
ఇకపోతే, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, అభివృద్ధి కార్యక్రహమాలు చేయాలని ఆయన సూచించారు. పేదవ సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలను తీసుకొచ్చామని వెల్లడించారు. నాయకుడు దూరదృష్టితో ఆలోచన చేస్తే జాతి బాగుంటుందని చెప్పారు. ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండటానికి వీల్లేదన్నారు.
దీపం పథకం కింద యేడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అతంమందికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు. మొన్నటివరకు రోడ్లు ఎలా ఉన్నాయో.. ఇపుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తాను ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తుంటే వైకాపా వాళ్లు వాటిని పాడు చేయడమేకాక పంపులు, స్టార్టర్లు ఎత్తుకెళుతున్నారని మండిపడ్డారు. వీళ్ల ఆలోచనలు మారాలని చెప్పారు.