ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వరం పెంచారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా, వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ట్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిం సోదరులను జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏకంగా కట్టుకున్న భార్యను వదిలివేసిన నరేంద్ర మోడీని ఏం చేయాలంటూ సూటిగా ప్రశ్నించారు.
గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థపై తనకు నమ్మకముందన్నారు. భువనేశ్వరి భర్తగా, లోకేశ్ తండ్రిగా, దేవాన్ష్ తాతగా గర్వపడుతున్నానని చంద్రబాబు చెప్పారు.