మంగళగిరిలో నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో నీటి కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధుబానందకర్ ఇటీవల సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
ఎయిమ్స్ ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్య నీటి కొరత అని డాక్టర్ మధుబానందకర్ చంద్రబాబుకు వివరించారు. ఈ సమస్య వల్ల తమ సేవలను విస్తరించలేకపోతున్నామని వివరించారు. ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాలు కేటాయించాలని కోరారు.
అలాగే విద్యుత్ సరఫరాలో ఉన్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఎయిమ్స్‌ను సందర్శించాల్సిందిగా సీఎం చంద్రబాబును డాక్టర్ మధుబానందకర్ ఆహ్వానించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ వీలైనంత త్వరగా నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక, ఆర్థిక సమస్యల కారణంగా ఎయిమ్స్‌కు నీటి సరఫరా నిలిచిపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లుగా ఎయిమ్స్‌లో నీటి సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో చేర్చేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.