ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం, తదితర అంశాలపై జరిగిన సీఎం జగన్ సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో దిశ ప్రాజెక్టు అమలు, మహిళా పోలీస్ యంత్రాంగం, శాంతి భద్రతలకు సంబందించి సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 74,13,562 మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. దిశయాప్‌ద్వారా 5238 మందికి సహాయం చేసామని, దిశ యాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684 నమోదు చేసినట్లు అధికారులు సీఎం కు స్పష్టం చేశారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేశామనీ కూడా పోలీసులు చెప్పారు. దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ వచ్చిందనీ పోలీసు అధికారులు సీఎం జగన్ కు వివరించారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. దిశ అమలు కారణంగానే ఇది సాధ్యమైందని, అలాగే జీరో ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేస్తున్నామని చెప్పారు. గతంలో డీఎన్‌ఏ రిపోర్టు కోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందని పోలీసులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయ గలుగుతున్నామని పోలీసు అధికారులు చెప్పారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ దిశ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు దిశపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అని ఆదేశించారు. దీనికోసం వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి అని సూచించారు. అలాగే దిశయాప్పై విస్తృత ప్రచారం నిర్వహించాలి అన్నారు. అలాగే దిశ చట్టం ప్రగతిపైనా సీఎం జగన్ అధికారులతో చర్చించారు. దిశబిల్లు ఆమోదం ఏ దశలో ఉందో అధికారులు సీఎంకు వివరాలు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదనీ సీఎం అన్నారు.
వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై అధికారులు సీఎం తో మాట్లాడుతూ పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయనీ తెలిపారు. డిసెంబర్ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయనీ అధికారులు స్పష్టం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయనీ అధికారులు సీఎం కు తెలిపారు. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందను పోలీసులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని ఆదేశించారు. ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలనీ, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలనీ సీఎం సూచించారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయడంతో పాటు వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలనీ సీఎం ఆదేశించారు.
ఏపీకి సంబంధంలేని డ్రగ్ వ్యవహారంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని, లేని అంశాన్ని... ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అని, వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారు అని సీఎం జగన్ మండి పడ్డారు. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి అని సూచించారు. మాదక ద్రవ్య రహితంగా కాలేజీలు, యూనివర్శిటీలు ఉండేలా తక్షణ చర్యలకు సిద్దం కావాలి అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అన్నికాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి అని అన్నారు. ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అని సీఎం సూచించారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్‌ఈబీ సహా... పోలీసులు ఉక్కుపాదం మోపాలి అని ఆదేశించారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.