వచ్చే ఎన్నికల్లో చేయి చేయి కలిపి రాష్ట్రానికి పట్టిన శనిని వదిలిస్తామని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా, చిత్తూరు జిల్లాలో ఈ రెండు పార్టీల నేతలు కలిసి ఇరు పార్టీల మధ్య తొలి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌ల నేతృత్వంలో ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత జిల్లాలోని గంగవరం సమీపంలో రాష్ట్రంలో తొలిసారి ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
ఇందులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. రాక్షస పాలన అంతమొందించాలంటే వచ్చే ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి టీడీపీ, జనసేనను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతిపాలు చేసిన ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించడమే తమ లక్ష్యమన్నారు.
మరోవైపు, జనసేన, టీడీపీ కలిసి త్వరలో ఉమ్మడి ప్రణాళికతో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని చేపడతాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రావులపాలెంలో మనోహర్‌కు స్వాగతం పలికారు. కొత్తపేట, కె. గంగవరం, కపిలేశ్వరపురం మండలాల్లో మరణించిన జనసైనికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందించారు