ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో మూడు దశల ఎన్నికలు జరగాల్సివుంది. అయితే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంటింటి ప్రచారం ముగిసిపోగా, మద్యం, నగదు పంపిణీకి అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా, చీప్ లిక్కరా (జగనన్నా బ్రాండ్లు).. అబ్బో వద్దన్నా.. పడిశెం పడుతుంది. జీవితంలో దాని జోలికెళ్ళేది లేదన్నా అంటూ చెబుతూ అభ్యర్థులకు షాకిస్తున్నారు.
ఈ సందట్లో కర్ణాటక నుంచి సరఫరా అవుతున్న మద్యం ఊళ్ళను ముంచెత్తు తోంది. ఇక్కడ క్వార్టరు ధరకు దొరికే మద్యం కర్ణాటక నుంచి తెప్పించుకుంటే ఒక ఫుల్ బాటిల్ వస్తోందని చెబుతున్నారు. కర్ణాటకలోని మద్యం వ్యాపారులు చిరునామాలు, ఫోను నంబర్లు సంపాదించి నేరుగా అభ్యర్థులతోనే సంప్రదిస్తున్నారు.
ఎంత మద్యం, ఏ క్వాలిటీ, ఎంత సరుకు కావాలి, ఎక్కడ డెలివరీ చేయాలి అనే విషయాలు నిర్ధారించుకుని నేరుగా వాళ్ళే ఇక్కడికి కావలసినంత మద్యాన్ని సరఫరా చేయడం ఈ సారి ప్రత్యేక విశేషంగా చెపుతున్నారు. డిజిటల్ పేమెంట్లతో కావలసినంత మద్యం, కావలసినన్ని బ్రాండ్లు చౌకగా సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు.
కర్ణాటక నుంచి ప్రధాన రహదారుల ద్వారా కాకుండా గ్రామాల మీదుగా వాహనాల్లో తెచ్చి అభ్యర్థులు చెప్పిన చోట డెలివరీ చేస్తున్నారు. పొరుగు రాష్టం నుంచి వెల్లువలా వచ్చి పడుతున్న మద్యాన్ని నిరోధించ డానికి ఎస్‌ఈబీ అధికారులకు సైతం సాధ్యం కావడం లేదు. అన్ని మండలాల్లోనూ రెండు మూడు రకాల బ్రాండ్లకు భారీ డిమాండు ఏర్పడిందని చెపుతున్నారు.
ఇక గురువారం నుంచి అభ్యర్థులు నగదు పంపిణీకి కూడా సమాయత్తమవుతున్నారు. ఎక్కడెక్కడ ఎలా పంపిణీ చేయాలన్న దానిపై వారు ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని సిద్ధంగా వున్నట్లు చెపుతున్నారు.