నివర్ తుఫాను దూసుకొస్తోంది. ఈ తుఫాను కారణంగా రాగల 72 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావం కారణంగా ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన వరిపంట పూర్తిగా నీట మునిగిపోయింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి 450 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలను కూడా భయపెడుతోంది.
ఈ వాయుగుండం మరో 12 గంటల్లో తుఫానుగా, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుండటంతో వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను రేపు సాయంత్రం తమిళనాడులోని మహాబలిపురం - కారైక్కాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ 'నివర్' తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, తెలంగాణలోనూ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు తీరంలో రెండు కోస్ట్‌గార్డ్ నౌకలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
ఇదిలావుండగా, కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మంగళవారం నుంచి గంటకు 65-75, అప్పుడప్పుడు 85 కి.మీ. వేగంతో వీస్తాయని విశాఖ తుఫాన్ హె చ్చరిక కేంద్రం తెలిపింది. కోతకొచ్చిన వివిధ పంటలను రైతులు తక్షణమే కోసి, జాగ్రత్త చేసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా సూచించారు. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక(ప్రమాద హెచ్చరిక) ఎగురవేశారు.
అంతేకాకుండా, రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలు, ఈనెల 25న కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 26న కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీగా, కొన్నిచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 27న కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.