Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని మార్చడం సరైన నిర్ణయం కాదు: బీజేపీ

రాజధాని  మార్చడం సరైన నిర్ణయం కాదు: బీజేపీ
, శుక్రవారం, 31 జనవరి 2020 (08:16 IST)
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మూడు రాజధానుల అంశంపై లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా మూడు రాజధానుల విషయంపై భారతీయ జనతా పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కన్నా లక్ష్మీనారాయణ తెలియచేశారు. 
 
రాజధాని అమరావతిని కొనసాగించాలని, అమరావతి నుంచి విశాఖకు పరిపాలనా రాజధాని  మార్చడం సరైన నిర్ణయం కాదని అన్నారు. రాజధాని మార్పు, మూడు రాజధానుల నిర్ణయం వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలతో పాటు అనేక మంది నిపుణులు, న్యాయ సంస్థలు  తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 
 
అభివృద్ధి వికేంద్రీకరణకు భారతీయ జనతా పార్టీ అనుకూలం కానీ పాలన వికేంద్రీకరణను అనుకూలం కాదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఘోరమైన నిర్ణయాల వలన ప్రజలకు అసౌకర్యంగా ఉందని అన్నారు.

ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడంతో పాటు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంపై తీవ్ర స్థాయిలో ఆర్థిక భారం పడుతుందని లేఖలో రాశారు.
 
రాజధాని విషయంలో జి.ఎన్.రావు కమిటీ విశాఖను పరిపాలన రాజధానిగా సూచించినప్పటికీ కమిటీ సున్నితమైన, భద్రతా పరమైన అంశాల గురించి అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.
 
విశాఖపై తుఫాను ప్రభావం, భారీ పరిశ్రమల కారణంగా గాలి నాణ్యత తగ్గడం, వాతావరణ కాలుష్యం, ఓడరేవు ప్రాంతంలో ముడి చమురు లీకేజీ సమస్యలు, సరిపడ ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం,  తూర్పు నావికాదళానికి భద్రత పరంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే అంశాలు కమిటీ హెచ్చరించిందని అన్నారు. 
 
అమరావతిలోనే శాసన, పరిపాలనా రాజధానులు కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను, అన్ని వర్గాల వారి అభిప్రాయాలను గౌరవించడం రాజ్యాంగబద్ధం అని కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిలపక్షంలో వైకాపా,టిడిపిల మధ్య వాగ్వాదం