Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిజెపి వైపు చంద్రబాబు అడుగులు?

Advertiesment
Chandrababu
, శనివారం, 10 ఆగస్టు 2019 (08:15 IST)
ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రమే కాకుండా బిజెపి నేతలంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. యూటర్న్ బాబుగా ఆయనను అభివర్ణించారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ఆ తర్వాత ప్రత్యేక హోదా కావాలని ఆయన డిమాండ్ చేయడంపై చంద్రబాబు మీద ఆ విమర్శలు వచ్చాయి.
 
ఎన్నికలకు ముందు కాంగ్రెసుతో కలిసి బిజెపి వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు ఫలితాల తర్వాత పూర్తిగా మారిపోయారు. ఎన్నికలకు ముందు కాంగ్రెసు నేత రాహుల్ గాంధీతో భుజం భుజం కలిపి నడిచారు. కాంగ్రెసుకు మద్దతు కూడగట్టడానికి జెడిఎస్ నేత కుమారస్వామిని, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీని కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ముఖం కూడా చూడలేదు.
 
తాజాగా, చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దులపై ఆయన యూటర్న్ తీసుకుని బిజెపికి వంత పాడారు. తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన వైనంపై చంద్రబాబు నోరు విప్పలేదు. పైగా, బిజెపికి మద్దతుగా నిలిచారు. ఇదంతా చూస్తే, చంద్రబాబు బిజెపికి దగ్గర కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అర్థమవుతోంది.
 
ఆర్టికల్ 370 కింద జమ్మూ కాశ్మీర్ కు ఒనగూరిన ప్రత్యేక హోదా రద్దుకు, ఆర్టికల్ 35ఎ రద్దుకు మద్దతు తెలపడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుకు మద్దతు తెలిపిన చంద్రబాబు ఎపికి ప్రత్యేక హోదా వద్దని చెప్పకనే చెబుతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారని, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని, స్టేక్ హోల్డర్లను విశ్వాసంలోకి తీసుకోలేని చంద్రబాబు విమర్శిస్తూ వచ్చారు. అయితే, జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం స్థానిక ప్రజలను విశ్వాసంలోకి బిజెపి తీసుకుందని చంద్రబాబు భావిస్తున్నారా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
 
బిజెపియేతర కూటమి కట్టడానికి చంద్రబాబు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మద్దతును చంద్రబాబు తీసుకున్నారు. ఎన్నికల్లో టీడీపి తరఫున రాయలసీమలో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం కూడా చేశారు. అబ్దుల్లా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీని బలపరుస్తూనే ఉన్నారు. ఎపికి ప్రత్యేక హోదా డిమాండుపై చంద్రబాబు ఫరూక్ అబ్దుల్లా మద్దతు తీసుకున్నారు. అయితే, జమ్మూ కాశ్మీర్ విషయంలో చంద్రబాబు ఫరూక్ అబ్దుల్లాకు మద్దతుగా నిలువలేకపోయారు.
 
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 1980 చివరి దిశకంలో నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసినప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ను కలుపుకున్నారు. అబ్దుల్లాను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్టికల్ 370పై ఎన్టీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. మరోవైపు నేషనల్ ఫ్రంట్ కు బిజెపి మద్దతు కూడా తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ రథసారథిగా ముకుల్ వాస్నిక్?