Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీలు - ప్రజాస్వామ్య మనుగడ కోసం పోరాటం :: చంద్రబాబు, పవన్

pawan - babu
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారిద్దరూ మంగళవారం విజయవాడ నోవాటెల్ హోటల్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని ప్రకటించారు. 
 
'ఎయిర్‌పోర్టు నుంచి వస్తూ పవన్‌ ఇక్కడున్నారని తెలిసి నేరుగా వచ్చా. మందుగా ఎవరికీ చెప్పలేదు. పవన్‌ను కలిసి సంఘీభావం తెలిపేందుకే వచ్చా. నాగరిక ప్రపంచంలో, ప్రజాస్వామ్యంలో విశాఖలో జరిగిన తీరు చూస్తే బాధేస్తోంది. పవన్‌ కల్యాణ్ విశాఖలో కార్యక్రమం పెట్టుకునేందుకు వెళ్తే పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసం తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు' అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'ఒక పోలీసు అధికారి వాహనం ఎక్కి నడిరోడ్డుపై పవన్‌ను నిలబెట్టే పరిస్థితి. దారిపొడవునా లైట్లు తీసి చీకట్లో పంపించారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరించి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. వైకాపా వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత లేదు. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజా సమస్యలపై ఎవరు పోరాడతారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకాపా లాంటి నీచమైన పార్టీని ఎప్పుడూ చూడలేదు. జగన్‌ పైశాచిక ఆనందం శాశ్వతం కాదు' అంటూ అన్నారు. 
 
'మనసు బాధపడి తప్పకుండా పవన్‌ను కలిసి సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చా. తెదేపా కార్యాలయంపై దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. ఇంత కన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం. ఆ తర్వాత ప్రజాసమస్యలపై పోరాడుదాం. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను కలిసి చర్చిస్తాం. 
 
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం. కొంతమంది పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరాం. బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉందా? సమస్యలపై ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి ఎవరికీ లేదు' అని చంద్రబాబు అన్నారు.
 
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'విశాఖలో జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తులను నలిపేస్తామంటే ఎలా? తెదేపా, జనసేనకే కాదు.. మా మిత్రపక్షమైన భాజపాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది. ఎన్నికల గురించి మాట్లాడాల్సిన సమయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయమిది. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయం ఒక్కరోజులో తేలేది కాదు. వైకాపాతో పోరాటం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ముందుగా న్యాయ, రాజకీయ పోరాటం చేస్తాం. అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే మా ఉద్దేశం' అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ‘బోర్న్‌ ఈవీ స్టార్టప్‌’గా రెండవ ర్యాంక్‌ సాధించిన ప్యూర్‌ ఈవీ