టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ నగరంలోని 5 ప్రధాన కూడళ్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ముందుగా పెందుర్తి జంక్షన్‌లో రోడ్ షోలో ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు.
విశాఖకు ఏ2 శని పట్టిందని.. ఆ శనిని వదిలించాల్సిందేన్నారు చంద్రబాబు. ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దాడులతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండ విజయం అందించాలని కోరారు. 22 నెలల సీఎం జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్న చంద్రబాబు.. రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్...? అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏ1కు ఎప్పుడూ భూములపైనే ధ్యాస అని.. విశాఖలో ఏ2 పెత్తనమేంటని ప్రశ్నించారు.