Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదు.. ఎమ్మెల్యే అమర్నాథ్‌

Advertiesment
విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదు.. ఎమ్మెల్యే అమర్నాథ్‌
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:15 IST)
విశాఖ నగరానికి మంచిరోజులు వచ్చాయని ఇది ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీకి తోడుగా ఉన్న కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్‌ మండిపడ్డారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ఐదేళ్లులో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఏ రోజన్నా విశాఖకు మంచి చేశారా అన్నది ప్రజలకు చెప్పాలని అమర్నాద్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో విశాఖకు చెప్పుకోదగ్గ ఏ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకురాలేదని తెలిపారు.

టీడీపీ నాయకులు, చంద్రబాబు విశాఖను వాడుకున్నారు తప్ప వారు విశాఖకు ఉపయోగపడలేదని గతంలో అనేక సందర్భాల్లో చెప్పానని అన్నారు. 2004–2009 మధ్య మహానేత వైయస్సార్‌ హయాంలోనే విశాఖ నగరం అభివృద్ధి జరిగిందని అమర్‌ గుర్తు చేశారు. 
 
మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో అచ్యుతాపురంలో 5వేల ఎకరాల్లో ఎస్‌ఈజడ్‌ తెచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని అమర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరవాడలో ఫార్మా సిటీ పెట్టి కంపెనీలు తీసుకువచ్చి వేలాది మందికి ఉఫాధి కల్పించిన వ్యక్తి వైయస్సార్‌ గారని గుర్తు చేశారు.

విశాఖ స్టీల్‌ వంటి నవరత్న కంపెనీని ప్రైవేటు పరం కాకుండా కాపాడి దాన్ని విస్తరించేలా చేయించిన వ్యక్తి వైయస్సార్‌ గారు అని తెలిపారు. బీహెచ్పీవీ వంటి కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుంటే బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేయించి ఆ కంపెనీలో వేలాది మంది కార్మికులను కాపాడిన వ్యక్తి వైయస్సార్‌ గారు మాత్రమే అన్నారు.

అంతేగాక, హిందుస్థాన్‌ షిప్‌ యార్డు నష్టాల్లో కూరుకుపోతే రక్షణశాఖ నుంచి వేలాది కోట్ల ఆర్డర్స్‌ తెచ్చి దాన్ని వైయస్సార్‌ కాపాడారు. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తే ఈ ప్రాంతం హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి అవుతుందని రుషికొండలో ఐటీ కోసం వేలాది ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు. 

ఫిల్మ్‌ ఇండస్ట్రీని విశాఖకు తీసుకురావాలని ఆనాడు రామానాయుడు ఫిల్మ్‌ స్టూడియోను వైయస్‌ఆర్‌ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించారని తెలిపారు. గంగవరం పోర్టును తెచ్చినా, నిమ్స్‌ (విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌) కోసం 100 ఎకరాలు కేటాయించారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న హెల్త్‌ సిటీని తెచ్చి వందలాది ఆసుపత్రులు వచ్చాయి.

ఒరిస్సా, ఛత్తీస్‌ ఘడ్‌ నుంచి ప్రజలు ఇక్కడకు రావటానికి కారణం ఆ రోజు ముందు చూపుతో వైయస్సార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమాలే కారణమని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తెచ్చినా, పోలవరం ప్రాజెక్టును ఈ ప్రాంతానికి తీసుకువచ్చి విశాఖ ప్రాంతంలో దాహార్తి తీర్చాలని, విశాఖ గ్రామీణ రైతాంగానికి సాగునీరు అందించాలని వైయస్సార్‌ ప్రయత్నించారు.

2005లో జీవీఎంసీ ద్వారా బీఆర్టీఎస్‌ లాంటి విస్తారమైన రోడ్లు నగరం చుట్టూ నిర్మించారు. గతంలో విశాఖ ఎయిర్‌ పోర్టులో వానపడితే విమానాలు ల్యాండ్‌ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. విశాఖ నగరానికి రావాల్సిన, వెళ్లాల్సిన ప్రయాణీకులు దీనివల్ల చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో ఎయిర్‌ పోర్టును వైయస్‌ఆర్‌ చొరవతో ఆధునీకరించారు. 

 
వైయస్‌ఆర్‌ తర్వాత మళ్లీ నేడు జగన్‌ విశాఖకు కొత్త బ్రాండ్‌ ఇమేజీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం విశాఖ ఇమేజిని ఏ విధంగా నాశనం చేసిందో మనం అందరం చూశామని అమర్నాధ్‌ మండిపడ్డారు. 
 
విశాఖకు రైల్వేజోన్‌ వద్దన్నది టీడీపీ నేతలేనని, జోన్‌ను గుంతకల్లు, గుంటూరు, విజయవాడకు తరలించాలన్నారు. హుద్‌ హుద్‌ తుఫాను వచ్చినప్పుడు విశాఖ నగరాన్ని టీడీపీ నేతలే తక్కువ చేసి మాట్లాడారని అమర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైల్వే జోన్‌ సందర్భంగా తను ఉద్యమం చేస్తే టీడీపీ నేతలు విమర్శలు చేశారన్నారు. హుద్‌ హుద్‌ తుఫాను వస్తేనే విశాఖ నగరం దేనికీ ఉపయోగపడదు. రైల్వేజోన్‌ ఇక్కడ వద్దు.. గుంటూరులో పెట్టమని టీడీపీ నేతలు, పార్లమెంట్‌ సభ్యులు ఎగతాళి చేశారని అమర్‌ మండిపడ్డారు.

జేసీ దివాకర్‌ అయితే గుంతకల్లులో, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ గుంటూరులో, కేశినేని నాని విజయవాడలో రైల్వేజోన్‌ పెట్టమన్నారని అమర్‌ గుర్తు చేశారు. విశాఖ నగరం దేనికీ ఉపయోగపడదని హుద్‌ హుద్‌ తుఫానులాంటిది ఇంకొకటి వస్తే ఎవ్వరూ జీవించలేరని టీడీపీ నేతలు తప్పుదోవపట్టించారని ఆయన మండిపడ్డారు.

విశాఖ నగర అభివృద్ధిని టీడీపీ నేతలే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణం ఎవరి హయాంలో జరిగింది? ఆ కుంభకోణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ప్రజలందరికీ తెల్సని అమర్‌ తెలిపారు.

ఈ రోజు ఒక ప్రాంతం పేరు చెప్పి జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి వచ్చి బెదిరిస్తున్నారని, సెటిల్మెంట్‌ చేస్తున్నారని ప్రభుత్వం మీద కొందరు అభాండాలు వేస్తున్నారు. దానికి కొన్ని పత్రికలు సహకరిస్తున్నాయి. విశాఖలో లక్షల కోట్ల విలువైన భూదందాలు, భూస్కాంలు టీడీపీ హయాంలో జరిగాయి. దీనివల్ల విశాఖ బ్రాండ్‌ ఇమేజిని ఏ విధంగా దెబ్బతీశారో ప్రజలందరూ చూశారన్నారు. 

టీడీపీ నేతలు చేసిన దందాలు, అక్రమాలు, ట్యాంపరింగ్, ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములు దోపిడీ చేశారు. బెట్టింగ్‌లు, పేకాట క్లబ్స్, హార్స్‌ క్లబ్స్‌ ద్వారా టీడీపీ నేతలు దోపిడీ చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఒక్క విషయం గమనించాలని అమర్నాద్‌ కోరారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క పేకాట క్లబ్‌ కానీ, బెట్టింగ్‌లు జరుగుతున్నాయా? అశ్లీలమైన నృత్యాలు ఎక్కడైనా జరుగుతున్నాయా? ఈ నాలుగు నెలల కాలంలో పేదవారికి ఎక్కరైనా అన్యాయం జరిగిందా? ఈ రకమైన అన్యాయాలు, అరాచకాలు టీడీపీ హయాంలో చేశారని అమర్నాద్‌ తెలిపారు.

అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానికి ధీటుగా ఉన్న నగరం విశాఖ అన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఎయిర్‌ పోర్టు, సీపోర్టు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని తెలిపారు. ఈ నగరాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయటానికి వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు.

దానికి సహకరించటానికి శాసనసభ్యులుగా మేము, వైయస్‌ఆర్‌ సీపీ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ పత్రికా సమావేశం తర్వాత పోలీసు కమీషనర్‌ ని కలుస్తామని తెలిపారు. భూదందాలు, సెటిల్మెంట్ల వార్తలు వచ్చినప్పుడు సుమోటాగా కేసులు నమోదు చేయాలని కమీషనర్‌ను కోరనున్నామన్నారు.

ఎవరి ఇంటికో.. ఎవరో వచ్చారని ఆరోపణలు వస్తే పోలీసు కంప్లైంట్‌ ఇవ్వాలి. దాన్ని పోలీసులు విచారించి నిజానిజాలు నిగ్గుతేలుస్తారని అమర్‌ తెలిపారు. 2014 ఎన్నికలప్పుడు ఈ రకమైన ప్రచారం చేశారని, ఇప్పుడు నగరం అభివృద్ధిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క టీడీపీ నాయకత్వమే కాదు. వారికి సహకరిస్తున్న పత్రికలతో పాటు ఓ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా వంతపాడుతున్నారని అమర్‌ తెలిపారు. వైయస్‌ఆర్‌ సీపీ సాధించిన విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు జగన్‌ ని ఆశీర్వదిస్తే దాన్ని తట్టుకోకపోతున్నారు.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో దీనిద్వారా లబ్ధిపొందాలని విషప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న పత్రికలు, వ్యక్తులు ఎవరైనా ఒక విషయాన్ని గుర్తించాలని అమర్‌ తెలిపారు. ఏనాడూ అన్యాయాన్ని వైయస్‌ఆర్‌ సీపీ ప్రోత్సహించదని, అసాంఘిక కార్యక్రమాలని ప్రోత్సహించదని, తెలియజేస్తున్నానని అన్నారు. 


దయచేసి ఏ పార్టీ అయినా సరే.. ఎవరైనా వైయస్‌ జగన్‌ పేరును కానీ, మా పేరును వాడుకోవద్దని పార్టీ సమీక్షా సమావేశంలో పార్టీ సీనియర్‌నేత, ఎంపీ, వి.విజయసాయి రెడ్డి గారు స్పష్టం చేశారని తెలిపారు. ప్రభుత్వం, చట్టం తన పని తను చేసుకుపోతుందని అమర్నాధ్‌ తెలిపారు.

ప్రజలకు అన్నిరకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా నగరాన్ని తయారు చేయబోతున్నామని దేశంలో అత్యున్నత నగరంగా రూపొందిస్తామని గుడివాడ అమర్నాధ్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలాకోట్‌లో ఉగ్ర కదలికలు... పీవోకే లక్ష్యంగా దాడి చేస్తాం : బిపిన్ రావత్