Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు అప్పులు తెచ్చి దోచుకు తిన్నారు: మంత్రి బొత్స

Advertiesment
చంద్రబాబు అప్పులు తెచ్చి దోచుకు తిన్నారు: మంత్రి బొత్స
, సోమవారం, 1 జూన్ 2020 (09:30 IST)
చంద్రబాబు అప్పులు తెచ్చి దోచుకు తిన్నారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. టీడీపీకి వ్య‌క్తుల ప్ర‌యోజ‌నాలే ముఖ్యం కానీ వ్య‌వ‌స్థ‌లు కాద‌న్నారు.

గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ ప్రభుత్వ పెద్దలు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలే తీసుకోలేదు, కానీ, పంచభూతాలను దోచుకున్నారంటూ మండిప‌డ్డారు. ఏదైనా ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకోవ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ స‌వాలు విసిరారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ..."జగన్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యింది. ప్రజలకు ఇచ్చిన హామీలు 90 శాతం పూర్తి చేశాం. ప్రజల గుమ్మం వద్దకే పాలన తీసుకొస్తాం అని చెప్పి ఆ దిశగా అడుగులు వేశారు.

1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను... ఎన్నో ప్రభుత్వాలు చూసాను. అనేక మంది ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో ఉన్నాజగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. చంద్రబాబు కూడా వీటిని ఖండించే పరిస్థితి లేదు.

టిడిపి విమర్శలు అన్ని కోడిగుడ్డుపై ఈకలు పీకడమే. మేము మాట తప్పాం అని చెప్పే పరిస్థితి ప్రతిపక్షాలకు లేదు. చంద్రబాబు అప్పులు తెచ్చి దోచుకు తిన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఆస్తిని కూడా క్రియేట్ చెయ్యలేదు.

రైతుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కొద్ది రోజుల్లో ప్రజల దగ్గరకు వెళుతున్నాం అని సీఎం అన్నారు. మానిఫెస్టో అమలు పై ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకుంటాం.టిడిపి మానిఫెస్టోలో ఉన్న అంశాలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. 500 యూనిట్స్ దాటిన వారికి మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచాం. మిగిలిన వారికి కరెంట్ బిల్లులో ఎటువంటి పెంపు లేదు.

గతంలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే వాటాలు అడిగేవారు. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఏడాది కాలంలో మా ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. సంవత్సర కాలంలో 40 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి స్థాయి నుండి జన్మభూమి కమిటీల వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.

ఈ ప్రభుత్వంలో టీడిపి కార్యకర్తలు కూడా లబ్ది పొందుతున్నారు. దివంగతనేత రాజశేఖరరెడ్డి జన్మదినం రోజున 27 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాం. పార్టీకి, కులాలకు, మతాలకు సంబంధం లేకుండా అర్హత ఉన్న వారందరికీ పథకాలు అందాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కోల్పోయారు. రమేష్ పదవి కోల్పోయి న్యాయస్థానానికి వెళ్లొచ్చు.

టిడిపి కోర్టుకి ఎందుకు వెళ్ళింది? టీడీపీకి వ్యక్తి కోసం వెళ్ళిందా? వ్యవస్ధ కోసం కోర్టుకు వెళ్ళిందా...? టిడిపి విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు నచ్చలేదు. అందుకే ఎన్నికల్లో వారిని తిరస్కరించారు. మేము ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మరి గతంలో టిడిపి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేక పోయింది.

న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది. అడ్వకేట్ జనరల్ చట్టం తెలియని వ్యక్తి కాదు. న్యాయస్థానం తీర్పును కొంతమంది వక్ర భాషతో చెప్తున్నారు. రమేష్ కుమారు మొదట ఇచ్చిన అర్డర్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో‌ యనమల సమాధానం చెప్పాలి.

ఏదో తప్పు ఉంది కాబట్టే ఎన్నికల సంఘం నిర్ణయం వెనక్కు తీసుకుంది. ప్రజలు గమనించాలి. ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే సాంకేతిక కారణాలు చూపి కోర్టుతో స్టే తెప్పిస్తారు. రోడ్డు పైన తాగి తిరుగుతున్నవారిని అడ్డుకుంటే, ఇంగ్లీష్ మీడియం ఇలా అన్ని అడ్డుకునే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయి.

లాక్ డౌన్ సమయంలో మా నాయకులు కార్యకర్తలు పేదలు పస్తు ఉండకుండా నిత్యావసర వస్తువుల పంపిణీ చేసి ఎంతో సహాయం చేశారు. సొంతగా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు.  ప్రజలకు వైసిపి ఎమ్మెల్యేలు సహాయం కోసం పోతే కోర్టుకు వెళ్లారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ నియమాలు పట్టించుకోలేదు. వైసీపీ నాయకుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో చంద్రబాబు లాక్డౌన్ ఉల్లంఘించినా ఎలాంటి తీర్పు ఇచ్చిందో ప్రజలందరూ గమనించాలి" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవ చరిత్రలో తొలిసారి... వాణిజ్య స్పైస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వ్యోమగాములు