ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. శనివారం వెల్లడైన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈయన 7,543 ఓట్ల మెజార్టీ వైకాపా అభ్యర్థి రవీనంద్రా రెడ్డిపై గెలుపొందారు.
శుక్రవారం రాత్రి వెల్లడైన ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మలె్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ శనివారం వెల్లడైన పశ్చిమ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. పశ్చిమ రాయలసీమ స్థానం ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు.
ఈ ఫలితాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు. గెలిపించిన వారికి కృతజ్ఞతలు. ఎన్నికల్లో వైకాపా అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నా. ఇది ప్రజా విజయం. మార్పునకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం అని వ్యాఖ్యానించారు.