ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బెదిరించారు. ఈ కేసు విచారణను తక్షణం నిలిపివేసి కడపను వీడి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులపై సీబీఐ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వలీబాషాను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీనిపై ఆయన కడప చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ బెదిరింపులపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 8వ తేదీన సీబీఐ అధికారులకు భోజనం తెచ్చేందుకు వలీబాషా కారులో కడపలోని హరిత హోటల్ నుంచి బైపాస్ రోడ్డులోని డాబాకు వెళ్లారు. భోజనం పట్టుకుని తిరిగి వస్తుండగా, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారుకు బైకును అడ్డుగా పెట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.
సీబీఐ అధికారులతో పాటు నువ్వు కూడా దర్యాప్తును ఆపేసి కడపను వదిలి తక్షణం వెళ్లిపోవాలి. లేదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దండుగులు తనను బెదిరించిన విషయమై ఈ నెల 9వ తేదీన వలీబాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.