మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శించింది. ఇందులోభాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నగరంలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో ఐదు రోజుల తర్వాత హాజరవుతానని అవినాశ్ బదులిచ్చారు. ఈ ఐదు రోజుల గడువుకు ముందు.. గడువు తర్వాత ఏం జరుగబోతుందనేది ఇపుడు ఉత్కంఠగా మారింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆరంభం నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును కోరడంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. ఈ నేథ్యంలో సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఇపుడు సంచలనంగా మారింది.
ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా అవినాష్‌ను ప్రశ్నించని సీబీఐ అధికారులు సోమవారం ఏకంగా పులివెందుల వెళ్లారు. అవినాశ్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కోసం ఆరా తీశారు. భాస్కర్ రెడ్డి అక్కడ లేకపోవడంతో స్థానిక వైకాపా కార్యాలయానికి వెళ్లి అడిగారు. అయితే, ఆయన అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. సీబీఐ అధికారులు దాదాపు అర గంట పాటు అక్కడే వేచివున్నారు.
ఆ తర్వాత అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను రాఘవరెడ్డికి అందజేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని అవినాశ్‌ను అందులో కోరగా, ఆయన తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందు వల్ల ఐదు రోజుల తర్వాత ఎపుడు పిలిచినా వస్తానని చెప్పారు. ఇపుడు వివేకా హత్య కేసులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
కాగా, వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి తొలుత వెళ్లింది అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ ఇప్పటికే ధృవీకరించింది. వీరు ఆధారాలు చెరిపివేయడం, రక్తపు మరకలు శుభ్రం చేయడం, గుండెపోటుగా చిత్రీకరించడం వంటి పనులు చేశారు. ఇపుడు వీటిపైనే సీబీఐ వారి నుంచి వివరాలు ఆరా తీయనుంది.