Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించవచ్చా?!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించవచ్చా?!
, మంగళవారం, 17 మార్చి 2020 (08:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు…ప్రభుత్వానికి మధ్య రేగిన రగడ సరికొత్త అంశాలకు తెర లేపుతోంది. ఎస్ఈసీపై కత్తి కట్టిన జగన్ ప్రభుత్వం ఆయన్ని తొలగించడంపై వ్యూహరచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎస్ఈసీని తొలగించడం అంత సులభమా?

అసలు ఎవరు ఆయన్ను నియమిస్తారు? 
ఎవరు తొలగించవచ్చు? తొలగించాలంటే ఏం చేయాలనేది హాట్ టాపికైంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమానమైన అధికారాలుంటాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు. అభిశంసన బిల్లుతోనే ఎస్‌ఈసీ తొలగింపు సాధ్యం. ఇందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాయిదా వేయడంపై వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. అంతే కాదు…ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మరికొందరు పోలీస్ అధికారులను తప్పించాలని సూచించింది సీఈసీ. దాన్ని సైతం తప్పుబట్టింది అధికార పార్టీ.

హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషర్‌కు ఉంటాయని ఇందుకు సమాధానంగా ప్రకటన విడుదల చేశారు సీఈసీ రమేష్ కుమార్. ప్రస్తుతం ఎన్నికలను వాయిదా మాత్రమే వేశామని, రద్దు చేయలేదన్నారు. ఫలితంగా ప్రభుత్వం వర్సెస్ సీఈసీ మధ్య గొడవ జరుగుతుందని అర్థమవుతోంది.
 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉండే అధికారాలేంటి? దాని అధికార పరిధి ఎంత అనే విషయం పై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భారత రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌(ఏ) అధికరణల కింద 1994 సెప్టెంబర్‌లో ఏర్పాటైంది. దీని ప్రకారం ఎన్నికల జాబితాను రూపొందించేందుకు ఆదేశించడం, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బాధ్యత.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్లుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ప్రత్యేక అధికారాలుంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ సభ్యుల ఎన్నికలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తే, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయితీ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ ఎన్నికలన్నీ స్టేట్ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయి.

బ్యాలెట్ పత్రాలు లేక బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటు చేయమని చెప్పడం, వార్డు సభ్యులు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఛైర్మన్, మున్సిపాల్టీలో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పోరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నికలు సజావుగా జరిగే చూడటం స్టేట్ ఎన్నికల కమిషనర్ విధి.

రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం. ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడటం. రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం. ఓటరు జాబితాల ఎలక్ట్రానికీకరణ వంటి పనులను ఎన్నికల కమిషనర్ చూస్తారు.
 
ఎస్‌ఈసీని గవర్నర్‌ నియమిస్తారు. తనకున్న విశేషాధికారాలతోనే సీఈసీ విధులను నిర్వహిస్తారు. అలా కాకుండా ప్రభుత్వానికి, ప్రజలకు వ్యతిరేకంగా గానీ..దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే అంశాలైతే ఆయన్ను విధుల నుంచి తొలగిస్తారు. అసమర్థత, దుష్ర్పవర్తన ఉంటే తొలిగించే ఆలోచన చేస్తారు.

ఒకవేళ సీఈసీని తొలగించాలంటే మాత్రం అభిశంసన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు అసెంబ్లీని సమావేశ పర్చాల్సిందే. అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆయన్ను తొలగిస్తూ బిల్లుపెట్టాలి. ఆ తర్వాత దాన్ని గవర్నర్‌ ఆమోదంతో కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర హోం, న్యాయశాఖలు దానిపై సమీక్షిస్తాయి. దాన్ని కేంద్రం ఆమోదిస్తేనే ఎస్‌ఈసీ పదవీచ్యుతుడవుతారు.

ఎస్‌ఈసీని అభిశంసించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా కేంద్రం అందుకు ఒప్పుకునే పరిస్థితి ఉండవచ్చు. ఉండకపోవచ్చు. కేంద్ర అధికారుల సూచనలతోనే తాను ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ ఎన్నికల కమిషనర్ ను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చెప్పారు. కాబట్టి ఆయన్ను అభిశంసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపినా పట్టించుకుంటుందా లేదా అనేది ఆసక్తికరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా? : కేసీఆర్‌