Publish Date: Wed, 24 Dec 2025 (18:04 IST)
Updated Date: Wed, 24 Dec 2025 (18:06 IST)
వైకాపాను వీడబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ఆ పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో వైకాపా అధికారం కోల్పోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైకాపా నేతలు పై మూడు పార్టీల్లోకి సర్దుకున్నారు. ఇపుడు కూడా మరికొందరు వైకాపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారిలో మాజీ ఎంపీ బుట్టా రేణుక ఒకరు.
ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి అసత్య వార్తలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారే రేపు ప్రజల ముందు నవ్వులపాలవుతారంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, తాను వైకాపాలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు, ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేశానని చెప్పారు. ప్రస్తుతం పార్టీ బలోపేతమే తన లక్ష్యమన్నారు. జగన్ నాయకత్వంపై తనకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. ఒకవేళ జగన్‌కు దూరం కావాల్సివస్తే అదే తన రాజకీయ జీవితానికి చివరి రోజు అవుతుందన్నారు.