Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 28న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం?!

మార్చి 28న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం?!
, బుధవారం, 11 మార్చి 2020 (04:48 IST)
మార్చి నెలాఖరులో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతూ అందులో భాగంగానే అడ్వాన్స్ బడ్జెట్‌ ఆమోదించుకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2020-21 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి తొలుత రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చులు కోసం కొంత మొత్తానికి ఆమోదం పొందుతారని సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన మరోవైపు ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో మార్చి 31లోపు బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో ఆర్థిక కార్యకలాపాలు ముందుకు సాగాలంటే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి.

మార్చి 27న... పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంది. ఆ తర్వాత 29 వరకూ గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ ఆమోదం ఎలాగనే చర్చ సాగుతోంది. తొలుత ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటారని ప్రచారం జరిగింది. అలాచేయాలన్నా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి స్వల్పకాలానికి ఓటాన్‌ అకౌంట్‌కు ఆమోదం పొందాలి.

పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలైలోపు ఆమోదించుకోవాలి. ఏప్రిల్‌లో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించి పూర్తిస్థాయి బడ్జెట్‌పైనా చర్చ జరిపి ఆమోదింపజేసుకునే వెసులుబాటు ఉందంటున్నారు ఆర్థికశాఖ అధికారులు. 2020-21 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రభుత్వ అజెండాకు, లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌కు చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో తొలుత ఓటాన్‌ అకౌంట్‌, తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ వల్ల సమావేశాల నిర్వహణపరంగాను, ఇతరత్రా అనవసర వ్యయప్రయాసలు అనే కోణంలో చర్చ సాగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే తొలుత స్వల్పకాలిక ఖర్చులకు అడ్వాన్సు బడ్జెట్‌ ఆమోదం పొందవచ్చని నిర్ణయించారు. దీనిప్రకారం మార్చి 31లోపుగా అడ్వాన్స్‌ బడ్జెట్‌ ఆమోదింపజేసుకుంటారు. ఏప్రిల్‌లోనూ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగిస్తారు.

నిబంధనల ప్రకారం అవసరమైనన్ని రోజులు సమావేశాలు జరిపి పూర్తి బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. మార్చి 28న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, పంచాయతీ ఎన్నికలున్నా సమావేశాలకు పెద్దగా ఇబ్బంది ఉండదనే కోణంలో ఆలోచిస్తున్నారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు