బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ కారణంగా నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏకమయ్యాయి. దీంతో వరద పోటెత్తింది. జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో నీటిని కిందికి వదిలివేశారు. ఫలితంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ముఖ్యంగా, నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కోవూరు వద్ద జాతీయ రహదారి తెగిపోయింది. నెల్లూరు రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పడుగుపాడు వద్ద రైలు పట్టాలపై నీరు చేరాయి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో నీటి ప్రవాహానికి రైలు కట్ట తెగిపోయింది. ఫలితంగా రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి.
ఇటు రైల్వే ట్రాక్, అటు జాతీయ రహదారి తెగిపోవడంతో చెన్నై - విజయవాడ ప్రాంతాల మధ్య అన్ని రకాల వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. అయితే, పడుగుపాడు వద్ద వరదనీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. దీంతో రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే, జాతీయ రహదారిని సైతం మరమ్మతులు చేస్తున్నారు.